న్యూఢిల్లీ: తనపై వచ్చిన ప్రశ్నకు నగదు ఆరోపణలకు సంబంధించి అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాను లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గురువారం ఆదేశించింది.
బిజెపి ఎంపి, ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ గురువారం సమావేశమైంది. సమావేశం అనంతరం సోంకర్ విలేకరులతో మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రె ఎంపి మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయడంలో కేంద్ర హోం వ్యవహారాలు, ఐటి మంత్రిత్వశాఖల సహాయం కోరతామని తెలిపారు. మహువాను అక్టోబర్ 31న తమ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
ఈ వ్యవహారానికి సంబంధించి న్యావాది జై అనంత్ దెహద్రాయి, బిజెపి నాయకుడు నిషికాంత్ దూబే వాంగ్మూలాలను గురువారం ఎథిక్స్ కమిటీ నమోదు చేసింది.
మహువా మొయిత్రాపై చేసిన ప్రశ్నకు నగదు ఆరోపణలను బలపరుస్తూ దెహద్రాయ్ తనకు పంపిన పత్రాలను బిజెపి ఎంపి దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందచేసిన ఫిర్యాదులో ప్రస్తావించారు. స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించారు.