Thursday, January 23, 2025

గడువుకు మించి పని చేసిన ఉభయ సభలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో పార్లమెంటు ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభ నిర్ణీత సమయానికి మించి పని చేశాయి. అంతేకాదు 17వ లోక్‌సభ సమయంలో వాయిదాల కారణంగా ఎలాంటి సమయం వృథా కాని సమావేశం ఇదొక్కటేనని ఓ మేధావుల సంస్థ క్రోడీకరించిన గణాంకాలను బట్టి తేలుతోంది. నిర్ణయించిన గడువుకన్నా ఒక రోజు ముందు అంటే గురువారం నాడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేవలం ఒకే ఒక బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లునుమాత్రమే ఉభయ సభలు ఆమోదించాయి. పార్లమెంటు 75 సంవత్సరాల ప్రయాణం, చంద్రయాన్3 విజయవంతంపైనా చర్చ జరిగింది. ఈ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభ నిర్ణీత సమయమైన 22 గంటల 45 నిమిషాలకన్నా 8 గంటలు ఎక్కువగా

అంటే 31 గంటలకు పైగా సమావేశమైందని పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ అనే సంస్థ క్రోడీకరించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. అంటే లోక్‌సభ నిర్ణీత సమయానికన్నా మించి దాదాపు 137 శాతం పని చేసింది. అదే విధంగా రాజ్యసభ కూడా నిర్ణీత సమయం 21గంటల 45 నిమిషాలకు మించి 27 గంటల 44 నిమిషాల పాటు పని చేసింది. అంటే నిర్ణీత సమయం కన్నా మించి 128 శాతం పని చేసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభుత్పాదకత 132 శాతంగా ఉన్నట్లు సమావేశాల ముగింపు సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే ఆ తర్వాత దీన్ని 160 శాతంగా సవరించారు. ఈ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వాయిదాల కారణంగా ఎలాంటి సమయం వృథా కాకపోవడం గమనార్హం. అయితే రాజ్యసభ మాత్రం వాయిదాల కారణంగాదాదాపు గంటన్నర సమయాన్ని కోల్పోయింది. కాగా పార్లమెంటు చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక ఉత్పాదకత కలిగిన సమావేశమని గణాంకాలను బట్టి తెలుస్తోంది.

2020వర్షాకాల సమావేశాల్లో మాత్రమే లోక్‌సభ నిర్ణీత సమయానికి మించి 145 శాతం పని చేసింది. కాగా ప్రత్యేక సమావేశంలో 66 శాతం చర్చలపైన, మిగతా 33 శాతం లెజిస్లేటివ్ కార్యకలాపాలపైనా గడిపినట్లు ఆ సంస్థ గణాంకాలను బట్టి తెలుస్తోంది మరోవైపు రాజ్యసభ చర్చల పైన 51 శాతాన్ని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంపై 45 శాతం సమయాన్ని ఖర్చు చేసినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రత్యేక సమావేశాల అజెండాలో భాగంగా పరిశీలన కోసం అయిదు బిల్లులను చేర్చినప్పటికీ వాటిలో ఏ ఒక్కటీ చర్చకు రాలేదు. చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ఈ నెల 19న ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో 32 మంది మహిళా ఎంపీలతో సహా మొత్తం 60 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ బిల్లును దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.

మజ్లిస్ పార్టీ ( ఐఎఎంఎం)కు చెందిన ఇద్దరు సభ్యులు మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. లోక్‌సభ సెక్రటేరియట్ లెక్కల ప్రకారం పార్లమెంటు 75 సంవత్సరాలపైన చర్చను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించగా ఆరు గంటల 43 నిమిషాలు చర్చ జరిగింది. చర్చలు 36 మంది పాల్గొన్నారు.మరోవైపు చంద్రయాన్3పై లోక్‌సభలో చర్చ12 గంటల 25 నిమిషాల పాటు జరగ్గా 87 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఇక రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ 12గంటలకు పైగా చర్చ జరిగింది. ఎగువ సభలో చర్చలపై 14 గంటలకు పైగా వెచ్చించడం జరిగిందని పిఆర్‌ఎస్ డేటా పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News