Friday, November 22, 2024

సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -
Lok Sabha passage of Surrogacy Bill
రాజ్యసభ సవరణలకు ఆమోదం తెలిపిన దిగువసభ

న్యూఢిల్లీ: సరోగసీ(అద్దె గర్భం) నియంత్రణ బిల్లు2019కి ఆమోదం తెలిపిన అనంతరం లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. అజయ్‌మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ నిరసన తెలపడంతో లోక్‌సభ కార్యక్రమాలు శుక్రవారం సజావుగా సాగలేదు. లఖింపూర్‌ఖేరీ హింసాత్మక ఘటనతో అజయ్‌మిశ్రా కుమారుడికి సంబంధమున్నదన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ డిమాండ్‌తో కొన్ని రోజులుగా ఉభయసభల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సరోగసీ బిల్లుకు లోక్‌సభ 2019, ఆగస్టు 5న ఆమోదం తెలిపింది. అనంతరం దానిని రాజ్యసభకు పంపగా వారం రోజుల క్రితం కొన్ని సవరణలతో ఈ నెల 14న తిరిగి లోక్‌సభకు పంపింది.

రాజ్యసభ సవరణలకు లోక్‌సభ నుంచి ఆమోదం పొందాల్సి ఉన్నందున ఆరోగ్యశాఖమంత్రి భారతీప్రవీణ్‌పవార్ శుక్రవారం దానిని తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉభయసభలు ఆమోదించడంతో సరోగసీ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారనున్నది. దాని ప్రకారం సరోగసీ నియంత్రణ కోసం నేషనల్ సరోగసీ బోర్డుతోపాటు స్టేట్ సరోగసీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. నిబంధనలమేరకే సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనేందుకు అనుమతిస్తారు. లా కమిషన్ తన 228వ నివేదికలో నైతిక సరోగసీకే అనుమతించాలని, వాణిజ్య సరోగసీకి అనుమతించొద్దని సూచించింది. ఉదయం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలకు స్పీకర్ ఓంబిర్లా అనుమతించగా, ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. దాంతో, నాలుగు ప్రశ్నలకు సమాధానాల అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 2 గంటలకు తిరిగి సమావేశమైనపుడు స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్రఅగర్వాల్ సరోగసీ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News