Thursday, November 14, 2024

మానవీయ దృష్టి లోపం!

- Advertisement -
- Advertisement -

నేరాలకు శిక్షలు విధించే శాసన వ్యవస్థను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు సమూల సంస్కరణలకు బహుదూరంగా వున్నాయని చెప్పక తప్పదు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశంలోని సామాజిక వ్యవస్థ పట్ల మానవీయ అవగాహన బొత్తిగా లేదని ఈ చట్టాలు చాటుతున్నాయి. ఒకటికి రెండు సార్లు పరిశీలనతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వీయ పర్యవేక్షణలో ముస్తాబైన శాసన త్రయంలో కొన్ని సాంకేతిక మార్పులు మినహా గుణాత్మకమైన కొత్తదనం లేదు. భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి), నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి), సాక్షాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) ఈ మూడూ వలస పాలకులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా దేశ పాలన సాగించడానికి రూపొందించుకొన్నవని వాటికి పరిపూర్ణమైన దేశీయ ఆత్మ చేకూర్చడానికి ఈ సవరణ బిల్లులను తీసుకొచ్చామని అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. బిజెపి హిందూత్వ దృష్టికి మానవీయ స్పర్శ వుండే అవకాశం లేదు. అందుచేత పాత చట్టాలకు అవసరమైన కొత్తదనాన్ని అద్దడంలో అది విఫలమైంది.

టెర్రరిజాన్ని అరికట్టడం మీద, దేశ రక్షణపైనే అధికంగా దృష్టిని కేంద్రీకరించింది. ప్రగతిశీల సామాజిక దృక్పథాన్ని మన క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సమకూర్చలేకపోయింది. అంతేకాక 140 మంది ప్రతిపక్ష సభ్యులు లేని పార్లమెంటులో తగినంత లోతైన చర్చకు పెట్టకుండా సవరణలను తూతూ మంత్రంగా ఆమోదింప చేసుకోడంలోని ఏకపక్ష ధోరణి ప్రజాస్వామిక లక్షణాన్ని పూర్తిగా కోల్పోయింది. శిక్ష విధించేటప్పుడు నేరం నేపథ్యంలో వుండే సామాజిక చేదు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోడం ప్రగతిశీల లక్షణం అవుతుంది. నేరస్థులలో పరివర్తనకు దోహదపడని శిక్ష ప్రయోజన రహితమే. ఎంత ఘోర నేరం చేసినవాడినైనా ఉరి తీయడం వల్ల కలిగే మేలు శూన్యమనేది అనుభవ సత్యం. ఉరి శిక్షలు వేసినా, అంత వరకు ఆగకుండా పోలీసు ఎన్‌కౌంటర్లు చేయించినా ఆ ఘోరాలు, నేరాలు పదే పదే మరీ మరింతగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల ఉరి శిక్షలు క్రౌర్యాన్ని మాత్రమే నిరూపించుకొంటాయి గాని, నేర నిరోధంలో ఎందుకూ పనికి రావు. ఈ దృష్టితో ఉరి శిక్షలకు చోటు లేకుండా చేసి వుంటే అది విప్లవాత్మకమైన సంస్కరణ అయి వుండేది. పేద నేరస్థులకు న్యాయ సాయం ప్రస్తుతం అంతంత మాత్రంగానే వున్నది.

నేరం రుజువు కాకుండా దశాబ్దాల తరబడి జైళ్లల్లో మగ్గుతున్న నిరక్షరాస్య, నిరుపేద నిందితులు అసంఖ్యాకంగా వున్నారు. యవ్వన క్రియాశీల జీవితమంతా వెలుగు చొరని జైలు గోడల మధ్య గడిపిన తర్వాత నిర్దోషులుగా తేలేవారు కోల్పోయే బతుకులను వారికి తిరిగి ఎవరు ఇస్తారు? ఇటువంటి ప్రశ్నలకు మానవీయ సమాధానాలు రాబట్టి అందుకు అనుగుణంగా క్రిమినల్ చట్టాలు సవరించి వుంటే అది వలస శిక్షాస్మృతిని మార్చినట్టు అయ్యేది. కాని ఆ వైపుగా ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు. సెక్షన్లు తగ్గించడం లేదా పెంచడం, వాటి వరుసను మార్చడం సంస్కరణ అనిపించుకోదు. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చామని అమిత్ షా ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ధోరణిని, దానిని విమర్శించడాన్ని దేశద్రోహంగా పరిగణించడం జరగదని జాతి సమగ్రతకు, దేశ సార్వభౌమత్వానికి, సమైక్యతకు ముప్పు వాటిల్ల చేసే చర్యలను మాత్రమే దేశద్రోహంగా పరిగణించేలా చట్టంలో మార్పు తెచ్చామని వెల్లడించారు. అలాగే వేర్పాటువాద చర్యలను కూడా దేశద్రోహం పరిధిలోకి తీసుకొచ్చారు.

ఇక్కడ తీవ్ర నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయి అక్కడ స్థిరపడిన నేరస్థుల కేసుల్లో వారి పరోక్షంలోనే విచారణ జరిపి శిక్షలు ప్రకటించడానికి కొత్త చట్టంలో అవకాశం కల్పించారు. లైంగిక నేరాలను అరికట్టడానికి ‘మహిళలపై, బాలలపై నేరాలు’ అనే కొత్త అధ్యాయాన్ని చేర్చారు. 18 ఏళ్ళలోపు ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి జీవిత ఖైదు, ఉరి వరకు పెంచారు. అయితే గతంలో తీసుకొచ్చిన నిర్భయ, పోక్సో వంటి చట్టాలు విఫలమైన చోట ఈ కొత్త శిక్ష సాధించగలిగేదేమి వుంటుం ది? మొత్తం మీద బాధితులకు న్యాయం జరిగేలా చూడడమే ఈ మార్పుల లక్షమని అమిత్ షా ప్రకటించారు. ఇండియన్ పీనల్ కోడ్‌కు బదులు భారతీయ న్యాయ సంహిత అని హిందీ శీర్షికను పెట్టడం వెనుక బిజెపి హిందీ పెత్తందారీతనమే కనిపిస్తున్నది. బహుభాషలు మాట్లాడే ప్రజలున్న దేశంలో ఇటువంటి మార్పు సముచితం కాదు. వెనుకబడిన, శతాబ్దాలుగా చెప్పనలవికాని సామాజిక అణచివేతకు గురైనవారు జనాభాలో అత్యధికులుగా వున్న దేశంలో సామాజిక న్యాయానికి అగ్రతర ప్రాధాన్యం ఇవ్వడం మానవీయ అవసరం. ఇది సవరించిన క్రిమినల్ చట్టాలలో ప్రతిబింబించకపోడం శోచనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News