Monday, December 23, 2024

డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ పౌరుల డిజిటల్ హక్కులను బలోపేతం చేయడంతోపాటు వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝళిపించేందుకు వీలుగా తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023కు ఆమోదం తెలిపింది. గత వారం ఈ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశ పెట్టగా, సోమవారం దీనిపై చర్చ చేపట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి.

వారి నిరసనల మధ్యే మూజువాణీ పద్ధతిలో ఓటింగ్ చేపట్టి బిల్లును ఆమోదించారు. భద్రతా కారణాల రీత్యా పౌరుల డేటాను వినియోగించుకునే అధికారం కేంద్ర సంస్థలకు ఉంటుంది. వ్యక్తిగత సమాచార గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, ఆన్‌లైన్ వేదికలు పౌరుల డేటాను అనుమతి లేకుండా వినియోగించడాన్ని నిషేధించేలా చట్టం చేయాలని 2017 లో సుప్రీం కోర్టు ఆదేశించింది. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. ఈ బిల్లు ప్రకారం డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేక పోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా, సదరు కంపెనీలపై కనిష్ఠంగా రూ. 50 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించాలనే నిబంధనను తీసుకొచ్చారు.

ఈ చట్టం అమలు కోసం “డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ”ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఈ బోర్డు, దాని సభ్యులు , ఉద్యోగులు , అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు ఉండవని బిల్లులో తెలిపారు. అయితే కొన్ని ప్రత్యేక కేసుల్లో ప్రైవసీ రక్షణ నుంచి మినహాయింపులుంటాయి. దేశ సార్వభౌమత్వం, సమైక్యత విషయంలో వర్తించదు. దేశ రక్షణ, విదేశీ సంబంధాల విషయాల్లోనూ ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంది. తీవ్రమైన నేరాలు, కోర్టు ఆదేశాల్లోనూ వర్తించదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News