ఆన్ లైన్ ప్రకటనలపై 6 శాతం డిజిటల్ పన్నును రద్దు చేశారు. దీనితో పాటు 35 ప్రభుత్వ సవరణలతో లోక్ సభ ఫైనాన్స్ బిల్లు 2025ను లోక్ సభ ఆమోదించింది. దీంతో బడ్జెట్ ఆమోదం ప్రక్రియ లోక్ సభ పూర్తయింది.ఇక రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లు పై చర్చ జరగనున్నది. రాజ్యసభ కూడా ఆమోదిస్తే 2025-26 బడ్జెట్ ఆమోదం ప్రక్రియ పూర్తయినట్లే..2025 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకాలకు రూ 5,31,850.21 కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపు రూ. 4,15,356.25 కోట్లుమాత్రమే. కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 16.29 లక్షల కోట్లు కేటాయించారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వాటా, గ్రాంట్లు, రుణాలు, కేంద్రం ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసే మొత్తంతో సహా రాష్ట్రాలకు బదిలీ అయ్యే నిధులు రూ. 25,01,284 కోట్లు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 4.4శాతంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8 శాతంగా అంచనావేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో
స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి) రూ. 3,56,97,923 కోట్లుగా అంచనా వేశారు. జాతీయ గణాంక సంస్థ విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం జిడీపీ రూ. 3,24,11,406 కోట్లు. అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో జిడిపీ 10.1 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా.