Wednesday, January 22, 2025

పిఒకె మనదే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అమిత్ షా పాక్ ఆక్రమిత కశ్మీర్( పిఓకె)పై సంచలన ప్రకటన చేశారు. అది భారత దేశానికి చెందినదేనని లోక్‌సభలో తేల్చి చెప్పారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన రెండు తప్పుల కారణంగా జమ్మూ కశ్మీర్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు.‘ నెహ్రూ చేసిన రెండు తప్పుల కారణంగా జమ్మూ, కశ్మీర్ తీవ్రంగా నష్టపోయింది. మొదటిది పాక్‌తో యుద్ధంలో మనసైన్యం గెలుస్తున్న సమయంలో కాల్పుల విరమణ ప్రకటించడం. ఒక వేళ మరో మూడు రోజులు యుద్ధాన్ని కొనసాగించి ఆ తర్వాత కాల్పుల విరమణ ప్రకటించి ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ మన దేశంలో భాగమై ఉండేది. ఇక రెండోది మన అంతర్గత సమస్యను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లడం’ అని బుధవారం లోక్‌సభలో జమ్మూ, కశ్మీర్ రిజర్వేషన్( సవరణ) బిల్లు), జమ్మూ, కశ్మీర్ పునర్వవస్థీకరణ( సవరణ) బిల్లులపై చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి చెప్పారు. ‘ ఇక్కడ ఉపయోగించిన ‘నెహ్రూవియన్ బ్లండర్’ అనే పదాన్ని నేను సమర్థిస్తా. నెహ్రూ సమయంలో జరిగిన ఘోరమైన తప్పిదాల కారణంగా కశ్మీర్ తీవ్రంగా నష్టనోయింది. జవహర్‌లాల్ నెహ్రూ పదవీ కాలంలో రెండు తప్పిదాలు జరిగాయి. ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇన్నేళ్ల పాటు కశ్మీర్ నష్టపోయింది.

ఈ విషయాన్ని నేను బాధ్యతతో చెబుతున్నాను’ అని అమిత్ షా చెప్పారు. నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలనుంచి తీవ్ర నిరసన వ్యక్తమయింది. వారంతా వాకౌట్ చేశారు కూడా. అయితే ఆ తర్వాత తిరిగి సభలోకి వచ్చారు. ప్రతిపక్షాల వాకౌట్ తర్వాత బిజెడి నాయకుడు భర్తృహరి మహతాబ్ మాట్లాడుతూ హోంమంత్రి ‘హిమాలయన్ బ్లండర్’గురించి కూడా మాట్లాడితే బాగుండేది అని అన్నారు. 1962లో చైనాతో యుద్ధానికి దారితీసిన నెహ్రూ చర్యలను ‘హిమాలయన్ బ్లండర్’గా అభివర్ణిస్తారనే విషయం తెలిసిందే. దీనికి అమిత్ షా స్పందిస్తూ తాను నెహ్రూ చేసిన రెండు తప్పుల గురించి ప్రస్తావిస్తేనే ప్రతిపక్షాలకు బాధ వేసిందని, ‘హిమాలయన్ బ్లండర్’ పదాన్ని గనుక ఉపయోగిస్తే వాళ్లు రాజీనామా చేసి ఉండే వాళ్లని అన్నారు. కాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎవరినీ అవమానించడానికి చేసినవి కాదని, వాస్తవాలు చెప్పడం కోసం చేసినవి మాత్రమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. బిల్లుల గురించి హోంమంత్రి మాట్లాడుతూ .. సొంత దేశంలోనే బలవంతంగా శరణార్థులుగా మారేందుకు ప్రేరేపించబడిన బాధితులకు న్యాయం చేసేందుకు ఈ బిల్లులు ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు.

ఎవరైతే విస్మరించబడ్డారో, అవమానించబడ్డారో వారికి తమ హక్కులు కల్పించడమే ఈ బిల్లుల ప్రధానోద్దేశమని చెప్పారు. ఏ సమాజంలోనైనా అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావాలని, అదే ప్రాథమిక అంశమని అమిత్ షా నొక్కి చెప్పారు. అయితే వారి గౌరవం దెబ్బతినకుండా ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. హక్కులు ఇవ్వడానికి, గౌరవప్రదంగా మక్కులు ఇవ్వడానికి తేడా ఉందని, .. కాబట్టి బలహీనమైన,అణగారిన వర్గానికి బదులుగా వెనుకబడిన వర్గమని పిలవడం ముఖ్యమని అన్నారు. జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలను కల్పించే ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ ఇది తాత్కాలికమైన అర్టికల్ అని దీన్ని రద్దుచేసి తీరాల్సిందేనని అమిత్ షా అన్నారు.‘ మీకు ఆ ధైర్యం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యాన్ని ప్రదర్శించి దాన్ని రద్దు చేశారు’ అని హోంమంత్రి కాంగ్రెస్ సభ్యులనుద్దేశిస్తూ అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకోకుండా చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోందని, 2026 నాటికల్లా ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పారు. కాగా, ఇంతకు ముందు కశ్మీర్ డివిజన్‌లో 46, జమ్మూ డివిజన్‌లో 37 స్థానాలు ఉండేవి. తాజా బిల్లులో కశ్మీర్‌లో 47,జమ్మూలో 43 అసెంబ్లీ స్థానాలను పెంచినట్లు కూడా అమిత్ షా చెప్పారు.

ఇక పిఓకె మన దేశంలో భూభాగమే కాబట్టి అక్కడ 23 స్థానాలను రిజర్వ్ చేసినట్లు చెప్పారు. కాగా రెండు రోజలు పాటు దాదాపు ఆరుగంటలపాటు చర్చ అనంతరం లోక్‌సభ జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు 2023, జమ్మూ, కశ్మీర్ రీ ఆర్గనైజేషన్(సవరణ) బిల్లు2023కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల్లో పునర్విభజన తర్వాత వాసన సభ నియోజకవర్గాల సంఖ్య ఎలా ఉండనుంది? రిజర్వేషన్ల అమలు ఎలా? వంటి అంశాలను పొందుపరిచారు. కశ్మీర్‌లో రెండు అసెంబ్లీ స్థానాలను కశ్మీర్‌నుంచి వలసవెళ్లిన వారు,ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌నుంచి వలస వచ్చి స్థిరపడిన వారికి రిజర్వ్ చేసినట్లు అమిత్ షా చెప్పారు. తొలిసారిగా ఎస్‌సి/ఎస్‌టి కమ్యూనిటీలకు 9 స్థానాలను రిజర్వ్ చేసినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News