Thursday, December 19, 2024

నేడే ఆరోదశ పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ శనివారం (నేడు 25వ తేదీ) జరుగుతుంది. ఈ దశలో 11 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు 58 పార్లమెంటరీ నియోజకవర్గాలలో విజేతలను ఖరారు చేసేందుకు ఓటింగ్‌కు దిగుతారు. పట్టణ ప్రాంత ఓటర్లు కనబరుస్తున్న ఓటింగ్ నిరాసక్తత పట్ల ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్లిప్తతను వీడి ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియకు తరలిరావాలని శుక్రవారం వెలువరించిన ప్రకటనలో తెలిపారు. హర్యానాలో 10 , ఢిల్లీలోని మొత్తం ఏడు , ఉత్తరప్రదేశ్‌లోని 14, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఎనిమిది చొప్పున, జార్ఖండ్‌లో 4, జమ్మూ కశ్మీర్‌లో ఒక్కస్థానానికి ఈ విడతలో పోలింగ్ జరుగుతుంది. శనివారం నాటి పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. లోక్‌సభ స్థానాలతో పాటు ఇప్పుడు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈసారి ఎన్నికల బరిలో కొందరు ప్రముఖ నేతల రాజకీయ భవితవ్యం ఖరారు కానుంది. ఇందులో హర్యానాలోని కర్నాల్ నుంచి బిజెపి అభ్యర్థిగా ఖట్టర్, రోహతక్ నుంచి దీపేందర్ హూడా, యుపిలోని సుల్తాన్‌పూర్ నుంచి మేనక గాంధీ, అనంత్‌నాగ్ రాజౌరి నుంచి పిడిపి అధినేత్రి, మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ వంటి వారు ఉన్నారు.

ఇక అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలై పెద్ద ఎత్తున ప్రచారం సాగించిన దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు ఎంపి స్థానాలకు హోరాహోరీ పోటీ ఉంది. గెలుపు ఎవరిది? అనేది ఓటర్లు తేల్చనున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి నగర ప్రాంతాలు కూడా ఈసారి పోలింగ్ విడతలో ఉన్నందున అక్కడి ఓటర్లు ఇళ్లు వీడి తమ ఓటు హక్కు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తమ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో 6వ విడత పోలింగ్‌లో దాదాపుగా 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. అయితే ఈసారి తీవ్రస్థాయి ఎండలు , వడగాడ్పులు, శనివారం ఆదివారం సెలవులు వంటి కారణాలతో పోలింగ్ శాతం ఏ విధంగా ఉంటుందనేదానిపై కలవరం నెలకొంది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరిగాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి మొత్తం మీద 889 మంది అభ్యర్థులు తమ బలపరీక్షకు దిగారు. శనివారం నాటి పోలింగ్‌తో ఇప్పటి ఎన్నికలలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News