Thursday, March 6, 2025

చిచ్చురాజేస్తున్న పునర్విభజన

- Advertisement -
- Advertisement -

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తున్న కొద్దీ ఈ ప్రక్రియపై అలముకున్న వివాదాల తేనెతుట్టె అంతకంతకూ కదలడం మొదలైంది. పునర్విభజన వల్ల తీవ్రంగా నష్టపోయే దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమం లో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు పునర్విభజన విధివిధానాలను తప్పుబడుతూ, జనాభా ప్రాతిపదికన కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిలో తమ తమ రాష్ట్రాల భాగస్వామ్యం ఆధారంగా పునర్విభజన జరగాలంటున్నారు. దక్షిణాదిలో రేకెత్తుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర హోంమంత్రి.. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదిన ఒక్క సీటు కూడా తగ్గదంటూ చేసిన ప్రకటన నమ్మదగినదిగా లేదు సరికదా, ఏ ఆధారంతో ఆయన అలా అన్నారో కూడా అర్థం కాదు.

జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజన వల్ల తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే, ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాలలోనూ జనాభా తక్కువ. కుటుంబ నియంత్రణపై గతంలో దక్షిణాది రాష్ట్రాలు సలిపిన కృషే ఇందుకు కారణం. కుటుంబ నియంత్రణపై కేంద్రంలోని పెద్దల ఆదేశాలను తూచ తప్పక పాటించి, జనాభా పెరుగుదలను నియంత్రించినందుకు తమకు దక్కిన ప్రతిఫలం ఇదేనా అన్న దక్షిణాది రాష్ట్రాల నేతల ప్రశ్న సముచితమైనదే. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8 శాతం మాత్రమే. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనలో ప్రస్తుతం ఉన్న 19 కంటే సీట్ల సంఖ్య మరింత తగ్గక తప్పదు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఉన్న 42 సీట్లు, మొత్తం 543 లోక్‌సభ సీట్లలో 7.73 శాతానికి సమానం.

అలా చూసినా, ఈ రెండు రాష్ట్రాలలోనూ సీట్ల సంఖ్యలో కోత పడుతుందన్నమాటే.ప్రతి రాష్ట్రంలోనూ జనాభాను బట్టి నియోజకవర్గాల విభజన జరగాలని రాజ్యాంగంలోని 81వ అధికరణ నిర్దేశిస్తోంది. ఈమేరకు పదేళ్లకు ఒకసారి జనగణన జరిపి, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉండగా 1970 నుంచీ ఈ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ముందుకు కదలలేదు. ఇందుకు కారణం దక్షిణాది రాష్ట్రాలనే చెప్పాలి. కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలు చేసిన కారణంగా జనాభా తగ్గిందని, పునర్విభజన జరిపితే తాము నష్టపోతామంటూ దక్షిణాది రాష్ట్రాలు చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుని 2001 వరకూ ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ 42వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చింది. విచిత్రమేమంటే, 2001 నాటికి కూడా ఇదే పరిస్థితి ఉండటంతో పునర్విభజన ప్రక్రియ 2026కు వాయిదా పడింది. ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొని ఉండటాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి.

జనాభా ప్రాతిపదికన కాకుండా ఆయా రాష్ట్రాలు సాధించిన ఆర్థిక ప్రగతిని, దేశాభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను పరిగణనలోకి తీసుకుని పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టడం సముచితంగా ఉంటుందన్న మేధావుల సూచన పరిగణించదగినదే. ఈ నేపథ్యంలో 2026లో జనగణన జరిపి, దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరపాలని కేంద్రం సంకల్పించడంతో సమస్య మళ్లీ మొదటకు వచ్చింది. జనాభాకే ప్రాముఖ్యమిచ్చి నియోజకవర్గాలను పునర్విభజన చేయడం వల్ల కొన్ని రాష్ట్రాలకు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. నియోజకవర్గాల సంఖ్య తగ్గితే రాజకీయ ప్రాతినిధ్యమూ తగ్గుతుంది. తమ రాష్ట్రం తరఫున చట్టసభల్లో గొంతు విప్పే సభ్యుల సంఖ్య తగ్గుతుంది.

అలా కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిలో తమ రాష్ట్రాలు పోషిస్తున్న పాత్రను, సాధిస్తున్న ప్రగతిని దృష్టిలో ఉంచుకుని పునర్విభజన జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అలా జరగాలంటే, జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే నష్టపోయే రాష్ట్రాలన్నీ ఒక్కతాటిపైకి రావలసిన అవసరం ఉంది. రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకునేందుకు, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు దక్షిణాది రాష్ట్రాలన్నీ చేతులు కలపవలసిన తరుణమిది. అవసరమైతే పునర్విభజన ప్రక్రియ లో అసమానతలు, అన్యాయాలపై కోర్టు గడప తొక్కేందుకు వెనుకాడకూడదు. దక్షిణాదిన బిజెపికి ఎక్కువ సీట్లు లేని కారణంగా పునర్విభజన ద్వారా తమకు పట్టు ఉన్న ఉత్తరాదిలోనే సీట్లు పెంచుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రగా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు స్పందించడం ద్వారా కమలనాథులు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. అవసరమైతే పునర్విభజన ప్రక్రియపై సందేహాలు లేవనెత్తుతున్న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి, వారిని అనుమానాలను నివృత్తి చేసేందుకు పూనుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News