ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం పటిష్ఠ చర్యలతో సమస్య లేదు
జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజనతోనే కొన్ని రాష్ట్రాలకు అన్యాయం
రాజకీయ, న్యాయ కార్యాచరణ ప్రణాళికకు నిపుణుల కమిటీ ఉండాలి
తమిళనాడు సిఎం స్టాలిన్
చెన్నై : లోక్‌సభ డిలిమిటేషన్ సమస్యపై రాజకీయ, న్యాయ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు నిపుణుల కమిటీ ఒకదానిని ఏర్పాటు చేయాలని డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం కోరారు. ‘డిలిమిటేషన్ నిష్పాక్షికంగా’ జరగాలని ఆయన ప్రతిపాదించారు. అయితే, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం పటిష్ఠత లక్షంగా తీసుకునే చర్యలతో తమకు సమస్య ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. చెన్నైలో తొలి సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) సమావేశంలో స్టాలిన్ ప్రసంగిస్తూ, తదుపరి జనగణన ఆధారంగా జరగనున్న లేదా భావి జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన కొన్ని రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నదని చెప్పారు. తెలంగాణ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఎ రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, బిఆర్‌ఎస్ సీనియర్ నేత కె తారక రామారావు ప్రభృతులు సమావేశానికి హాజరయ్యారు. వివిధ సామాజిక పథకాలు, ప్రగతిశీల సంక్షేమ పథకాల ద్వారా జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు ఈ ప్రక్రియ వల్ల గణనీయంగా పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని స్టాలిన్ సూచించారు.
ఈ విషయం గ్రహించే తాను తమిళనాడులో అన్ని పార్టీలతో ఈ నెల 5న ఒక సమావేశం నిర్వహించానని సిఎం తెలియజేశారు. ‘ప్రస్తుత జనాభా ప్రాతిపదికపై ఇప్పుడు ఉన్న 543 సీట్లను తగ్గించినట్లయితే తమిళనాడు 8 సీట్లను నష్టపోతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో సీట్లను పెంచినట్లయితే తమిళనాడు ప్రస్తుత ప్రాతినిధ్యం ప్రకారం వాస్తవ పెరుగుదలతో పోలిస్తే 12 సీట్లు నష్టపోతుంది. అది మా రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రత్యక్ష దెబ్బ అవుతుంది’ అని ఆయన చెప్పారు. ఆ మరునాడు అంటే ఈ నెల 6న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కోయంబత్తూరులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాలు దామాషా ప్రాతిపదికపై పార్లమెంటరీ సీట్లను కోల్పోవని చెప్పారని, ఇది అస్పష్టంగా, గందరగోళంగా ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. స్టాలిన్ ఈ సందర్భంగా 2023లో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార సభ ప్రసంగాన్ని ప్రస్తావించారు.
‘కుల గణన నిర్వహించాలని, జనాభా ఆధారంగా వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. తదుపరి చర్య డిలిమిటేషన్. కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా ప్రస్తుత జనాభా ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాలను మార్చినట్లయితే, దక్షిణాది రాష్ట్రాలు 100 సీట్లను కోల్పోతాయి. దక్షిణాది ప్రజలు దీనిని అంగీకరిస్తారా?’ అని ప్రధాని వ్యాఖ్యానించారని స్టాలిన్ వివరించారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్య ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందనని ప్రధాని స్వయంగా ‘అంగీకరించార’ని అర్థం అవుతోందని స్టాలిన్ పేర్కొన్నారు. ‘బిజెపి రాష్ట్రాలను, వాటి హక్కులను దెబ్బ తీసే పార్టీగా ఉంటోంది. డిలిమిటేషన్ ప్లాన్‌లో తమ దురుద్దేశాలనే అమలుచేయాలని వారు కోరుకుంటున్నారు. ఏ రాష్ట్రమూ దీనిని అనుమతించరాదు. ఈ ముప్పును గ్రహించే తమిళనాడు ఇది వరకు ఎన్నడూ లేని ఐక్యతతో కృషి చేస్తోంది. అటువంటి ఐక్యతనే కోరుతూ తాను డిలిమిటేషన్‌పై జెఎసికి ‘నిష్పాక్షిక డిలిమిటేషన్ కోసం జెఎసి’ అని పేరు మార్చినట్లు స్టాలిన్ తెలియజేశారు. ‘మేము డిలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదు. నిష్పాక్షిక డిలిమిటేషన్‌కు మేము అనుకూలమని ఈ పేరు సూచిస్తోంది. ఒక రోజు సమావేశమై, చర్చించి, తీర్మానం ఆమోదించడంతో ఈ పోరాటం ముగియదు. హక్కుల సాధనకు నిరంతర కార్యాచరణ ఎంతో అవసరం’ అని స్టాలిన్ చెప్పారు.
దక్షిణాదిపై వేలాడుతున్న కత్తి: కేరళ సిఎం
డిలిమిటేషన్ ప్రక్రియన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తిగా అభివర్ణించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ లేదా ప్రజాస్వామ్య సూత్రాలకు బదులు రాజకీయ ప్రయోజనాల దృష్టితోనే ఎవరినీ సంప్రదించకుండా ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. జనాభా ఆధారిత డిలిమిటేషన్ దక్షిణాదికి ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తూనే ఉత్తరాది రాష్ట్రాలకు బాగా మేలు చేస్తుందని విజయన్ వాదించారు.
జనాభా ఆధారిత డిలిమిటేషన్ అన్యాయం: నవీన్ పట్నాయక్
బిజెడి అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వర్చువల్‌గా సమావేశంలో ప్రసంగిస్తూ, పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య నిర్ధారణకు జనాభానే ప్రాతిపదికగా తీసుకోరాదని స్పష్టం చేశారు. డిలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించే ముందు అన్ని పార్టీలతో సమగ్ర చర్చ జరపాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికగా డిలిమిటేషన్‌కు పూనుకోవడం అన్యాయమని పట్నాయక్ అన్నారు. బిజెడి సమావేశానికి ఇద్దరు నేతలను పంపింది.