న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌సిపి నేత మహమ్మద్ ఫైజల్ పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం నోటిఫికేసన్ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీం కోర్టు లో విచారణ జరుగుతుండగానే ఈ నోటిఫికేషన్ రావడం గమనార్హం. 2009 లో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్‌పై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ ను కవరత్తీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తరువాత జనవరి 13న లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది.
ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపి వేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం గమనార్హం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ కేసులో ఇది ప్రభావం చూపనుంది.