Monday, January 20, 2025

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

ఎన్‌డిఎ అభ్యర్థిగా మరోసారి ఓం ఇర్లా
ఇండియా కూటమి తరఫున కొడికున్నీల్ సురేష్
లోక్‌సభ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం
ముందస్తు షరతులు కుదరదన్న అధికార పక్షం
సాంప్రదాయాన్ని గౌరవించాలన్న ప్రతిపక్షం

న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన పార్లమెంటరీ పదవికి గత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మళ్లీ అభ్యర్థిగా మంగళవారం నిలబెట్టిన బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ మూడవ పర్యాయం అధికారంలోసైతం పాతకాపులనే కీలక పదవులలో కొనసాగించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటోంది. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న బిజెపి కోరికను ప్రతిపక్షాలు భగ్నం చేసి ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపి కొడికున్నీల్ సురేష్‌ను బరిలోకి దించాయి. స్పీకర్‌గా ఎన్‌డిఎ ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటే డిప్యుటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని ఇండియా కూటమి ముందస్తు షరతు విధించగా దీనికి బిజెపి అంగీకరించకపోవడంతో స్పీకర్ ఎన్నిక చివరి నిమిషంలో అనివార్యంగా మారింది.

ఏకాభిప్రాయ సాధన కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్, డిఎంకె ఎంపి టిఆర్ బాలుతో కొద్దిసేపు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జెపి నడ్డా కూడా పాల్గొన్నారు. అయితే ఉభయ పక్షాలు తమ వైఖరికి కట్టుబడ్డాయి. చర్చలు విఫలం కావడంతో సమావేశం నుంచి బటయటకు వచ్చిన వేణుగోపాల్ లోక్‌సభ డిప్యుటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇచ్చే సంప్రదాయానికి బిజెపి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, ఓం బిర్లాపై తమ అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించారు.

అయితే ప్రతిపక్షం ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతూ ముందస్తు షరతులు పెడుతోందని కేంద్ర మంత్రులు పియూష్ గోయల్(బిజెపి), లలన్ సింగ్(జెడియు) ఆరోపించారు. డిప్యుటీ స్పీకర్ ఎంపిక జరిగినపుడు ప్రతిపక్షాల డిమాండును పరిశీలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారు మొండిగా వ్యవహరిస్తున్నారని మంత్రులు ఆరోపించారు. ఒత్తిడి రాజకీయాలు ఉండకూడదని లలన్ సిగ్ విలేకరుల వద్ద అన్నారు. ముందస్తు షరతులతో ప్రజాస్వామ్యం నడవదని పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. స్పీకర్ ఎంపిక బుధవారం జరగవలసి ఉంది. ఎన్నికే జరగవలసి వస్తే లోక్‌సభ చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇది మూడవసారి అవుతందని అధికార వర్గాలు తెలిపాయి.

లోక్‌సభలొ ఎన్‌డిఎకి 293 సంఖ్యాబలం ఉండగా ఇండియా కూటమికి 233 సంఖ్యాబలం ఉంది. లోక్‌సభలో బలాబలాన్ని బట్టి చూస్తే ఓం బిర్లాకే గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రెండు సీట్లలో గెలుపొందిన రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష కూటమికి కనీసం ముగ్గురు ఇండిపెండెంట్ ఎంపీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. స్పీకర్ పదవికి పోటీని నిలబెట్టే విషయంలో కాంగ్రెస్ ఒక్కటే దూకుడు వైఖరిని ప్రదర్శిస్తోందని, ఇండియా కూటమిలోని కొన్ని ఇతర పక్షాలకు పోటీ పైన ఆసక్తి లేదని బిజెపి వర్గాలు వ్యాఖ్యానించాయి. రాజస్థాన్‌లోని కోట స్థానం నుంచి గెలుపొందిన బిజెపి ఎంపి ఓం బిర్లా వరుసగా రెండవసారి లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగితే అలా జరగడం లోక్‌సభ చరిత్రలో ఇది ఐదవసారి అవుతుంది.

గతంలో కాంగ్రెస్ నాయకుడు బలరాం జక్కర్ ఏడవ, ఎనిమిదవ లోక్‌సభకు స్పీకర్‌గా వరుసగా రెండుపర్యాయాలు కొనసాగారు. మూడవ పర్యాయం లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లా గతంలో మూడుసార్లు రాజస్థాన్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా..ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ దళిత నాయకుడైన సురేష్ కేరళ నుంచి 8 సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి వస్తే నూతన లోక్‌సభలో ఎలెక్ట్రానిక్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రానందున పేపర్ స్లిప్పులను ఉపయోగిస్తారు. సభ్యులకు ఇంకా సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా ఇంకా జరగలేదు. అంతకుముందు స్పీకర్ అభ్యర్థి ఎన్‌డిఎ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపక్షాలను సంప్రదించడానికి సీనియర్ బిజెపి నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ చొరవ చూపారు.

ప్రధాని నరేంద్ర మోడీతోసహా సీనియర్ నాయకులను ఓం బిర్లా కలుసుకున్నారు. అయితే ఇది గెలుపోటములకు సంబంధించిన సమస్య కాదని, స్పీకర్ అధికార పార్టీ నుంచి ఉంటే డిప్యుటీ స్పీకర్ ప్రతిపక్షాల నుంచి ఉండడం సాంప్రదాయంగా వస్తోందని ఎన్‌టిఎ కూటమి అభ్యర్థి సురేష్ మీడియాకు తెలిపారు. ప్రతిపక్షంగా మిమల్ని గుర్తించలేదన్న సాకుతో గడచిన రెండు పర్యాయాలు డిప్యుటీ స్పీకర్ పదవిని ప్రతిపోఆలకు అధికార పక్షం ఇవ్వలేదని ఆయన చెప్పారు. కాని ఇప్పుడు ప్రతిపక్షంగా తమకు గుర్తింపు ఉందని, డిప్యుటీ స్పీకర్ పదవి తమ హక్కని ఆయన తెలిపారు. కాని ఆ పదవిని తమకు ఇవ్వడానికి బిజెపికి ఇష్టం లేదని, ప్రభుత్వం నుంచి సమాధానం కోసం ఉదయం 11.50 వరకు ఎదురుచూశామని, అయినా వారి నుంచి ఎటువంటి జవాబు రాలేదని ఆయన తెలిపారు.

దేశాన్ని నడపడంలో ఏకాభిప్రాయం కుదరాలంటూ ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఉద్బోధ చేసి 24 గంటలు కూడా గడవకముందే ఈ పరిణామం చోటుచేసుకుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. స్పీకర్ ఎకగ్రీవంగా ఎన్నికవ్వడం, డిప్యుటీ స్పీకర్ పదవి ప్రతిపోఆలకు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోందని ఆయన చెప్పారు. ఈ సాంప్రదాయాన్ని ప్రధాని మోడీ భగ్నం చేశారని ఆయన ఆరోపించారు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించం లేదని, 2024 ఎన్నికల ఫలితం తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓటమని ప్రధాని మోడీ ఇంకా వాస్తవాన్ని గ్రహించడం లేదని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఓంబిర్లా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ 10 సెట్లకు పైగా నామినేషన్లు(నోటీసెస్ ఆఫ్ మోషన్ అంటారు) దాఖలయ్యాయి.

వీటిలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నడ్డాతోపాటు బిజెపి సభ్యులు, మిత్రపక్షాలైన టిడిపి, జెడియు, జెడిఎస్, ఎల్‌జెపి(పాశ్వాన్) నుంచి కూడా ఉన్నాయి. సురేష్‌కు మద్దతుగా మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి నిమిషంలో విస్మయానికి లోనుచేసే నిర్ణయాలు తీసుకునే బిజెపి నాయకత్వం ఓం బిర్లాను స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించే విషయంలోను చివరి నిమిషం వరకు సస్పెన్స్‌ను కొనసాగించింది. చివరకు కీలక పదవులలో పాత కాపులనే కొనసాగించాలన్న తన వైఖరిని స్పీకర్ విషయంలోసైతం పాటించింది. అయితే రాజకీయ, ప్రభుత్వ నియంత్రణకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉన్నప్పటికీ పార్లమెంట్ నిర్వహణలో అత్యంత కీలకమైన ఈ పదవి కోసం జరిగే ఎంపికలో రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News