Friday, November 22, 2024

లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక మంచిదే: ఓమ్ బిర్లా

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్య మనుగడకు సూచిక
స్పీకర్ ఓమ్ బిర్లా
తొలి సెషన్‌లో అంతరాయాలపై విమర్శ
పార్లమెంట్‌లో డిబేట్లు, వీధుల్లో చర్చల మధ్య తేడా ఉంది

కోట/ బుండీ (రాజస్థాన్) : లోక్‌సభ స్పీకర్ పదవికి అరుదుగా ఇటీవల జరిగిన ఎన్నికను ‘ప్రజాస్వామ్య మనుగడకు సూచిక’గా స్పీకర్ ఓమ్ బిర్లా ఆదివారం అభివర్ణించారు. బిర్లా ప్రతిపక్ష అభ్యర్థి కె సురేష్‌పై మూజువాణి వోటుతో గెలుపొందిన విషయం విదితమే. బిజెపి అభ్యర్థి ఓమ్ బిర్లాకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నేత సురేష్‌ను నిలపడం ద్వారా ప్రతిపక్షం ఎన్నిక జరిగేట్లు చూసింది. కానీ వోట్ల డివిజన్ కోసం ప్రతిపక్షం పట్టుబట్టలేదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత లోక్‌సభ తొలి సెషన్‌లో అంతరాయాలను ఓమ్ బిర్లా ‘పిటిఐ’ ఇంటర్వూలో విమర్శించారు.

పార్లమెంట్‌లో చర్చలకు, వీధుల్లో చర్చలకు మధ్య తేడా ఉండవలసి ఉందని బిర్లా అన్నారు. రాడికల్ సిక్కు మత బోధకుడు అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి, ఉగ్ర నిధుల కేసు నిందితుడు ఇంజనీర్ రషీద్ జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఇండిపెండెంట్లుగా సభకు ఎన్నిక కావడం గురించి బిర్లా ప్రస్తావిస్తూ, ఆఇద్దరు సభ్యులను ప్రజలు ఎంచుకున్నారని తెలిపారు. ‘వారిని ప్రజలు ఎంచుకున్నారు. (లోక్‌సభ) సభా నిబంధనల ప్రకారం, కోర్టుల ఆదేశాలను అనుసరించి వారితో ప్రమాణ స్వీకారం చేయించాను’ అని బిర్లా చెప్పారు. రాజస్థాన్‌లోని కోట పార్లమెంటరీ నియోజకవర్గం సందర్శనకు వచ్చిన బిర్లా ‘పిటిఐ’ తో మాట్లాడారు.

లోక్‌సభ స్పీకర్ పదవికి అరుదుగా జరిగిన ఎన్నికల గురించిన ప్రశ్నకు బిర్లా సమాధానం ఇస్తూ, ‘ఇది ప్రజాస్వామ్యం మనుగడకు సూచిక’ అని పేర్కొన్నారు. స్పీకర్ పదవికి 1976లో ఎన్నిక జరిగింది. జూన్ 24 నుంచి ఈ నెల 3 వరకు జరిగిన లోక్‌సభ తొలి సెషన్‌లో గందరగోళ దృశ్యాలు కానవచ్చాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ రెండు గంటలకు పైగా సమాధానం ఇచ్చినంత సేపూ ప్రతిపక్ష సభ్యులు సభాధ్యక్షుని వేదిక ముందుకు దూసుకుపోయి, నినాదాలు చేశారు. ఇతర అంశాలతో పాటు నీట్ యుజి ప్రశ్న పత్రం లీక్ వివాదంపైన. మణిపూర్‌లోని పరిస్థితిపైన బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎపై ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు విరుచుకుపడ్డాయి.

పర్యవసానంగా లోక్‌సభ, రాజ్యసభ పలు మార్లు వాయిదా పడవలసి వచ్చింది. ‘అంగీకారాలు, వ్యతిరేకతలు’ ప్రజాస్వామ్యంలో భాగం అని బిర్లా అన్నారు. ‘విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఉండాలి కూడా. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ వల్ల ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పని చేయగలుగుతుంది. అభిప్రాయాలు ఎంత ఎక్కువగా వ్యక్తమైతే అంత మంచిది’ అని ఆయన అన్నారు. ‘అయితే, ఒక విషయం సుస్పష్టం. పార్లమెంట్‌లో చర్చకు, వీధుల్లో చర్చలకు మధ్య కొంత తేడా ఉండాలని జనం కూడా ఆశిస్తారు’ అని స్పీకర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News