న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎం బిర్లా కుమార్తె అంజలి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) మంగళవారం విడుదల చేసిన 89 మంది అభ్యర్థులతో కూడిన రిజర్వ్ జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఢిల్లీలోని రంజాస్ కళాశాలలో పొలిటికల్ సైన్స్(హానర్స్) చదివిన అంజలి తన తొలి ప్రయత్నంలోనే 2019లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అంజలి తెలిపారు. దేశ ప్రజల కోసం తన తండ్రి చూపుతున్న అంకితభావాన్ని చిన్న నాటి నుంచి చూస్తున్న తనకు సమాజానికి తన వంతుగా ఏదైనా సేవ చేయాలన్నదే తన ఆశయమని ఆమె తెలిపారు.
సివిల్ సర్వీసెస్‌లో తాను ఉత్తీర్ణత సాధించేందుకు తన అక్క, చార్టర్డ్ అకౌంటెంట్ ఆకాంశ ఎంతో తోడ్పడ్డారని ఆమె చెప్పారు. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు 2020 ఆగస్టు 4న విడుదలయ్యాయి. మొత్తం 927 ఖాళీలలో ఐఎఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపిఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు చెందిన గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టుల కోసం మెరిట్ ప్రాతిపదికన 829మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. 2019 పరీక్ష ప్రాతిపదికన రూపొందించిన రిజర్వ్ జాబితాలో వేర్వేరు సివిల్ సర్వీసుల కోసం కమిషన్ 89 మంది అభ్యర్థులను సోమవారం సిఫార్సు చేసింది. ఈ జాబితాలో అంజలి పేరు కూడా ఉంది.
Lok Sabha Speaker Om Birla Daughter selected to Civil Services