Sunday, January 19, 2025

సభ్యుల తీరు మారే వరకూ సభకు రాను: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల ధోరణిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభామర్యాదలను తగు విధంగా పాటించే వరకూ తాను సభకు హాజరుకాబోనని నిర్ణయించుకున్నారు. స్పీకర్ మనస్తాపం ఆయన సభ్యుల తీరుతో విసిగిపోయిన విషయాన్ని, సభకు హాజరుకారాదని నిర్ణయించుకున్న విషయాన్ని ఆయన సన్నిహితులు బుధవారం తెలియచేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచి సభలో కార్యకలాపాలకు తరచూ ఆటంకం ఏర్పడుతోంది. దీనితో విలువైన సభాసమయం వృధా అవుతోంది. మణిపూర్ పరిస్థితిపై విపక్షాలు ప్రధాని సమాధానానికి పట్టుబట్టడం, వెల్‌లోకి దూసుకువెళ్లడం, నినాదాలకు దిగడం, దీనికి ప్రతిగా అధికార పక్ష సభ్యులు కూడా పోటీగా నినాదాలకు దిగడం, పరిస్థితిని ఎంతగా అదుపులోకి తీసుకురావాలనుకున్నా,

సభ్యులను ప్రాధేయపడినా ఎటువంటి మార్పు రాని దశలో స్పీకర్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. బుధవారం లోక్‌సభ ఆరంభం కాగానే స్పీకర్ స్థానంలో బిర్లా కన్పించలేదు. ఓ వైపు ప్రతిరోజూ లాగానే బుధవారం కూడా సభలో నిరసనల హోరు కొనసాగుతూ ఉండటం, తొలుత సభ మధ్యాహ్నం రెండు గంటల వరకూ , తరువాత మొత్తం రోజుకు వాయిదా పడటం జరిగింది. ఈ దశలోనే స్పీకర్ తన ఛాంబర్‌లో సన్నిహితుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్లు, ముందు సభ్యుల తీరు మారితేనే సభకు వెళ్లేది అని చెప్పినట్లు వెల్లడైంది. సభకు స్పీకర్ హాజరు కాకుండా అలక వహించడం దాదాపుగా సభాచరిత్రలో ఇదే తొలిసారి కానుంది. ప్రతిపక్ష సభ్యులే కాకుండా అధికార పక్ష సభ్యులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ నొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం కొన్ని బిల్లుల ఆమోదం దశలో ఇరు పక్షాల సభ్యుల తీరు పట్ల స్పీకర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. స్పీకర్ సభలో తీరుపట్ల అసంతృప్తి చెందారని అధికార , ప్రతిపక్షాలకు సమాచారం అందించారు.

జులై 20న సెషన్ ఆరంభం నుంచి ఆటంకాల పర్వం సాగుతూ ఉండటం పార్లమెంటరీ సంప్రదాయాలకు, సభా మర్యాదలకు విఘాతం అని స్పీకర్ తన సన్నిహితుల వద్ద తెలిపినట్లు వెల్లడైంది. అ బుధవారం రోజువారితీరుగా తిరిగి ప్రతిపక్షాలు సభలో మణిపూర్ విషయంపై పట్టు వీడకపోవడం, ప్రధాని మోడీ మాట్లాడాల్సిందేనని పేర్కొనడం జరిగింది. ఈ దశలోనే గందరగోళం నడుమ సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. బుధవారం స్పీకర్ స్థానంలో బిజెపి సభ్యులు కిరిట్ సోలంకీ ఆసీనులై సభను నిర్వహణకు దిగారు. సభలో పద్ధతిని పాటించాలని పదేపదే సభ్యులను కోరారు. కానీ ఫలితం లేకుండాపోయింది. సభ వాయిదాకు దారితీసింది.

ఢిల్లీ బిల్లుపై చర్చ పెండింగ్
వివాదాస్పద ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల సేవల బిల్లు బుధవారం లోక్‌సభలో చర్చకు రావాల్సి ఉంది. ఆమోదం కూడా పొందుతుందని అధికారపక్షం ఆశించింది, అయితే మణిపూర్ రగడతో సభకు ఆటంకం ఏర్పడటం , అర్థాంతరంగా వాయిదా పడటంతో దీనిపై చర్చకు అనంతర ఆమోద ప్రక్రియ సంబంధిత ఓటింగ్‌కు వీల్లేకుండా పోయింది. ఈ బిల్లు ఓటింగ్‌కు వస్తుందని బిజెపి సభ్యులకు విప్ కూడా జారీ చేసి ఉంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News