Monday, December 23, 2024

లోక్‌సభ తీరుతో భారత్‌కు మరింత ఘనత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ విశిష్ట రీతిలో వ్యవహరించడం ద్వారా భారతదేశానికి ఉన్న ప్రజాస్వామ్య మాతృక గౌరవ ప్రతిష్ట మరింత పెరిగిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతల స్వీకరించి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా సోమవారం ఓం బిర్లా ట్వీటు వెలువరించారు. సభలో పలు కీలక నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నారని, ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి గర్వకారణం అన్నారు. 2019లో జూన్ 19న స్పీకర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రపంచంలో ప్రజాస్వామిక దేశంగా భారత్‌కు గురుతర స్థానం ఉందని, దీనిని నిలబెట్టే క్రమంలో లోక్‌సభ వ్యవహరించడం ముదావహం అన్నారు.

ఓం బిర్లా పదవీకాలం 2024 జూన్ 24న ముగుస్తుంది. సభలోని అన్ని పక్షాల సభ్యులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తికరించేందుకు అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని స్పీకర్ తెలిపారు. ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే బలీయమైన వేదికగా లోక్‌సభను తీర్చిదిద్దే క్రమంలో అంతా కలిసి రావాలని పిలుపు నిచ్చారు. 17వ లోక్‌సభ లెజిస్లేటివ్ ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని , సమావేశాల విషయంలో గణనీయ ప్రగతి సాధించిందని తెలిపారు. గడిచిన 11సెషన్స్‌లలో మొత్తం 162 బిల్లులను ప్రవేశపెట్టగా వీటిలో అత్యధికం ఆమోదం పొందాయన్నారు. తనకు ప్రధాని మోడీ, వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపిల నుంచి సరైన సహకారం అందిందని ఇది తనకు గుర్తుండే విషయం అవుతుందని ఓం బిర్లా తెలిపారు.
చట్టసభల్లో తీరు దారుణం.. రెండు రోజుల క్రితం స్పీకర్ ఆవేదన
మూడురోజుల క్రితం అంటే శుక్రవారం ముంబైలో జరిగిన లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చట్టసభల తీరుతెన్నులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కానీ అసెంబ్లీల్లో కానీ తరచూ సభ్యులు వెల్‌లోకి దూసుకురావడం, కాగితాలు చింపి సభాధ్యక్షుడి వైపు విసిరివేయడం, ప్రత్యేకించి అసెంబ్లీలు, పార్లమెంట్‌ల సిట్టింగ్‌ల సంఖ్య తగ్గిపోవడం దారుణం అన్నారు. ప్రజాస్వామిక పరాకాష్ట వేదికల్లో క్రమశిక్షాణారాహిత్యం ఎంతవరకు సబబని ప్రశ్నించి ఆవేదన వ్యక్తం చేశారు. సభా మర్యాదలు దెబ్బతింటున్నాయని, పార్టీలకతీతంగా అంతా కలిసి వీటిని నిలబెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశం తరువాత ఇప్పుడు సోమవారం స్పీకర్ ఓంబిర్లా తమ ట్వీటులో సభలు సత్ఫలితాలతో సాగుతున్నాయని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News