Thursday, January 23, 2025

ప్రభుత్వ అధికారుల ఇళ్లపై లోకాయుక్త దాడులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకవ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రదేశాలలో దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, బీదర్, కొడగు, చిత్రదుర్గ, దావణగెరె తదితర ప్రాంతాలలో లోకాయుక్త దాడులు గురువారం ఉదయం నుంచి కొనసాగుతున్నాయి.

ఈ దాడులలో దాదాపు 200 మంది పోలీసు అధికారులు పాల్గొంటున్నట్లు లోకాయుక్త వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఆధారం చేసుకుని బెంగళూరులోని 10 ప్రాంతాలలో లోకాయుక్త దాడులు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.

మడకెరె నగరంలోగల కొడగు అదనపు ఎస్‌పి నంజుండె గౌడ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పెరియపట్న సమీపంలోని మకనహళ్లి గ్రామంలో నంజుండె గౌడ మామగారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మైసూరు నగరంలో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో కూడా లోకాయుక్త సోదాలు కొనసాగుతున్నట్లు వారు చెప్పారు. మడికెరెలోని నంజుండె గౌడ నివాసంలో పెద్దమొత్తంలో నగదు, పత్రాలను లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

బెలగావి నగర కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్ అనిషశ్రీట్టార్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ధార్వాడ్‌లోని మిచిగన్ లేఅవుట్‌లో సంతోష్ నివాసం ఉంది. గతంలో ఆయన హుబ్బలి-దార్వాడ్ నగర కార్పొరేషన్‌లో పనిచేశారు.

కొప్పల్‌లోని నిర్మిత సెంటర్ మేనేజర్ మంజునాథ్ బన్నికొప్ప నివాసంలో కూడా లోకాయుక్త సోదాలు జరుగుతున్నాయి. హులిగి పట్టణంలోని ఒక లాడ్జిలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. ఆ పట్టణంలో కూడా దాడులు జరిగాయి.

ప్లానింగ్ సెక్షన్‌లో హరంగ్ డ్యాం సూపరింటెండెంట్ కెకె రఘుపతికి చెందిన మైసూరులోని విజయనగర్ ఫోర్త్ స్టేజ్‌లోని నివాసంపై కూడా లోకాయుక్త దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News