న్యూఢిల్లీ: లోక్‌సభలో మంగళవారం ప్రశ్నోత్తర సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద భారత, చైనా బలగాలు ఘర్షణపై ప్రతిపక్షాలు వాదనలకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దాంతో స్పీకర్ ఓమ్ బిర్లా లోక్‌సభను నేడు మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా వేశారు. ఇదిలావుండగా నేడు 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగువ సభలో ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
భారత, చైనా బలగాలు డిసెంబర్ 9న తవాండ్ సరిహద్దులో ఘర్షణలకు దిగిన విషయంపై అన్ని అంశాలను సస్పెండ్ చేసి దీనిపై మాత్రమే చర్చ జరపాలని రాజ్యసభ, లోక్ సభ సభ్యులు ఒకరోజు ముందుగానే రూల్ 267, రూల్ 176 కింద నోటీసులు ఇచ్చారు.
సభ సమావేశం కాగానే ఎంపీలు రంజీత్ రంజన్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఎల్. హనుమంతయ్య, జెబి మథర్, జజాని పాటిల్, నాసీర్ హుసైన్, మనీశ్ తివారీ, మనోజ్ కుమార్ , ప్రియాంక చౌదరి చర్చ జరగాలని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు జీరో అవర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా, అంతర్జాతీయ సరిహద్దు విషయంలో భారత ప్రయోజనాలు కాపాడేందుకు ఇది తప్పనిసరి అని వారు డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనీల్ చౌహాన్, సర్వీస్ చీఫ్‌లతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.