లండన్: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్రధారి, బ్రిటన్‌లో తొలి భారతీయ పార్లమెంట్ సభ్యుడు దాదాభాయ్ నౌరోజీ 19వ శతాబ్దం చివరిలో ఎనిమిదేళ్ల పాటు నివసించిన ఇంటికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి అపురూప గుర్తింపు లభించింది. లండన్ వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ భవనాలకు చారిత్రక ప్రాధాన్యతను గుర్తించే ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటీ నౌరోజీ నివసించిన బ్రోమ్లీలోని పెంగ్ ప్రాంతంలో 72 అనెర్లీ పార్క్ వద్ద ఉన్న వాషింగ్టన్ హౌస్‌కు బ్లూ ప్లేక్ గౌరవాన్ని ప్రకటించింది. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధి చెందిన దాదాభాయ్ నౌరోజీ భారత్‌కు సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వాలన్న భావన బలంగా ఏర్పడిన రోజుల్లో 1897లో బ్రిటన్‌కు వచ్చి వాషింగ్టన్ హౌస్‌లో నివసించారు. ఆ ఇంటిని ఇప్పుడు చారిత్రక ప్రదేశంగా అరుదైన గౌరవాన్ని ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటీ కల్పించింది. ఎరుపు ఇటుకలతో నిర్మించిన ఆ ఇంటి గోడపై దాదాభాయ్ నౌరోజీ 1825-1917 భారత జాతీయవాది, ఎంపి ఇక్కడ నివసించారు అని రాసి ఉన్న ఫలకం ఇప్పుడు అక్కడ కొత్తగా చేరింది.
London home of Dadabhai Naoroji gets Blue Plaque