Friday, January 24, 2025

28 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం: ఎట్టకేలకు దక్కిన ప్రభుత్వ ఉద్యోగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో ఉద్యోగం కోసం 28 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఓ వ్యక్తి ఎట్టకేలకు విజయం దక్కించుకున్నాడు.

అంకుర్ గుప్తా అనే వ్యక్తి పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం 1995లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వూలో పాసైన గుప్తా మూడు నెలల శిక్షణ కోసం కూడా ఎంపిక కూడా అయ్యాడు. వొకేషనల్ పద్ధతిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడన్న కారణంతో అతడి పేరును మెరిట్ లిస్టులో నుంచి తీసివేశారు. దీంతో తనతోపాటు ఉద్యోగం దక్కని అభ్యర్థులతో కలసి గుప్తా సెంట్రల్ అడ్మినేస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా1999లో తీర్పు వచ్చింది.

అయితే ట్రిబ్యునల్ తీర్పునుపోస్టల్ శాఖ 2000 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టులో సవాలు చేసింది. కాగా 2017లో పోస్టల్ శాఖ పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు ట్రివ్యునల్ ఉత్తర్వులను సమర్థించింది. మళ్లీ హైకోర్టులో పోస్టల్ శాఖ రివ్యూ పిటిషన్ వేయగా దాన్ని కూడా 2021లో హైకోర్టు కొట్టివేసిది. దీంతో పోస్టల్ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ దీపంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పోస్టల్ శాఖను తప్పుపడుతూ తీర్పు వెలువరించింది. ఒక అభ్యర్థిని ఎంపిక చేసి మెరిట్ లిస్టులో అతని పేరును చేర్చిన తర్వాత విద్యార్హతను సాకుగా చూపి పేరును తొలగించడం సబబు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. విద్యార్హత లేనిపక్షంలో ఎంపిక ప్రక్రియకు ముందే ఆ విషయం స్పష్టం చేసి ఉండాల్సిందని కోర్టు తెలిపింది.

మెరిట్ లిస్టులో పేరు చేర్చిన తర్వాత ఆ అభ్యర్థిని అనర్హుడిగా నిర్ణయించే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. వెంటనే గుప్తాను నెలరోజుల్లోపల పోస్టల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలోకి తీసుకోవాలని, ప్రొబేషన్ కాలం పూర్తయిన తర్వాత అతడిని పూర్తికాలం సర్వీసులోకి తీసుకోవాలని పోస్టల్ శాఖను కోర్టు ఆదేశించింది. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించనందున గుప్తాకు జీతానికి సంబంధించిన అరియర్స్(బకాయిలు) ఏవీ రావని, 1995లో తనతోపాటు ఉద్యోగంలో చేరిన అభ్యర్థులతో సమానంగా సీనియారిటీని పొందే అర్హత గుప్తాకు ఉండబోదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News