మెట్రో ప్రయాణంపై ఆంక్షలు
50 శాతం సీట్ల సామర్ధానికే అనుమతి
న్యూఢిల్లీ: కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కొత్త ఆంక్షలను విధించడంతో ఢిల్లీలోని వివిధ మెట్రో స్టేషన్ల వెలుపల బుధవారం పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. మెట్రో రైళ్లలో 50 సీటింగ్ సామర్ధాన్ని మాత్రమే అనుమతించడం, రైళ్లలో నిలబడి ప్రయాణించడాన్ని అనుమతించకపోవడంతోసహా వివిధ ఆంక్షలను ప్రభుత్వం అమలులోకి తీసుకురావడంతో ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించి తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం కొత్త ఆంక్షలను మంగళవారం జారీచేయడంతోపాటు తక్షణమే వాటిని అమలులోకి తీసుకురావడంతో మెట్రో రైళ్లపైనే ఆధారపడి ప్రయాణించేవారు బుధవారం ఉదయం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్ష్మీనగర్, అక్షర్‌ధామ్ తదితర స్టేషన్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరి నిలబడడం కనిపించింది. స్టేషన్ల వెలుపల బారులు తీరిన ప్రయాణికుల ఫోటోలను ఫేస్‌బుక్, ట్విటర్‌లో చాలామంది పోస్ట్ చేశారు.
ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు, కరోనా కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించి ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, జిమ్‌లతోపాటు ఇతర వినోద కేంద్రాలను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల పరిధిలో లేని వ్యాపార సంస్థలు సరిబేసి సంఖ్య విధానంలో తెరవాలని, మెట్రో రైళ్లు, బస్సులు 50 శాతం సీటింగ్ సామర్ధంతో నడపాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం డిఎంఆర్‌సి పరిధి సుమారు 392 కిలోమీటరు. మొత్తం 286 స్టేషన్లు ఉండగా నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో కారిడార్, ర్యాపిడ్ మెట్రో గుర్గావ్ అందులో ఉన్నాయి. మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించే గేట్ల సంఖ్యను సగం తగ్గించి ప్రయాణికుల ప్రవేశంపై ఆంక్షలను అమలుచేస్తుండడంతో స్టేషన్ల వెలుపలే ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తోంది. మొత్తం 712 గేట్లలో 444 మాత్రమే ప్రస్తుతం తెరచి ఉంచుతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.