Sunday, January 19, 2025

బిజెపి పెద్దలపై లుక్‌అవుట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ అధినేత సివి ఆనంద్ నేతృత్వంలోని సిట్ బృందం దూకుడు పెంచింది. విచారణకు హాజరవ్వని బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు. సోమవారం విచారణకు హాజరవ్వాలని బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలకు సిట్ నోటీసులు పంపించింది. కానీ ఆ ము గ్గురు సిట్ విచారణకు డుమ్మాకొట్టారు. ఈ ముగ్గురిపై లీగల్‌గా వెళతామని సిట్ పేర్కొంది. లీగల్ ఒపీనియన్ తీసుకుని విచారణకు హాజరవ్వని బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలను వాంటెడ్ జాబితాలో చేర్చి సిట్ సంచలనం సృష్టించిం ది.

అంతేకాదు, ఆ ముగ్గురిపై లుక్ అవు ట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు సిట్ విచారణ పూర్తిగా సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి కేంద్రంగానే ముందుకు సాగుతోంది. రామచంద్రభారతితో సంబంధం ఉన్న అందరి డీటెయిల్స్‌ని సిట్ అధికారులు సేకరిస్తు న్నారు. గడిచిన రెండేళ్లలో రామచంద్రభారతి ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఎవరెవరిని కలిశాడు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా రామచంద్రభారతి ఫోన్ నుంచి వేల ఫొటోలను అధికారులు రికవరీ చేశారు. అంతేకాకుండా రామచంద్రభారతి బిజెపికి సంబంధించిన అనేక మంది నేతలతో దిగిన ఫొటోలను కూడా రికవరీ చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో ప్రభుత్వాలు పడిపోయిన సమయంలో రామచంద్ర భారతి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

సింహయాజులు స్వామీజీపై అభిమానంతోనే టికెట్ బుక్ చేశా : న్యాయవాది శ్రీనివాస్

టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సోమవారం, మంగళవారం కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజులు స్వామీజీకి అభిమానంతోనే విమానం టికెట్ బుక్ చేశానని, అంతకు మించి ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని శ్రీనివాస్ తెలిపారు. రెండో రోజు విచారణకు హాజరైన ఆయన్ను దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు.

విచారణ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తనకు బిజెపితో ఎలాంటి సంబంధం లేదని, ఎంఎల్‌ఎల కొనుగోలు కేసుతోనూ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. గతంలో పూజలు చేయించుకున్న క్రమంలో సింహయాజులు స్వామీజీతో పరిచయమేర్పడిందని, ఆ అభిమానంతోనే టికెట్ బుక్ చేసినట్లు తెలిపారు. సిట్ అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఎసిబి ప్రత్యేక కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఎంతో కీలకమైన ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News