Thursday, November 28, 2024

గాజాలో ఆరని ఆకలి మంటలు!

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నగరాల్లో ఒకటైన గాజాలో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. హమాస్ దాడులతో రగిలిపోయిన ఇజ్రాయెల్.. కన్నుమిన్నూ కానకుండా సుమారు ఐదు నెలలుగా సాగిస్తున్న మారణహోమానికి రోజుకి వందల సంఖ్యలో గాజావాసులు బలవుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో శిథిలమైన ఇళ్ల మధ్య, చెత్తకుండీల వద్ద తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకులాడుతున్న ప్రజల దురవస్థ ఈ ప్రపంచానికి పట్టడం లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సాధారణ ప్రజానీకానికి హాని జరగకుండా చూడటం యుద్ధనీతి. ప్రపంచ దేశాల మధ్య కుదిరిన జెనీవా ఒప్పందమూ ఇదే చెబుతోంది. హమాస్ ఉగ్రవాదులతో పాటు అమాయక ప్రజలనూ శిక్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కాలరాస్తోంది. అతలాకుతలమవుతున్న గాజాకు వివిధ దేశాలనుంచి మానవతా సాయాన్ని కూడా అందకుండా చేస్తోంది. అటు రష్యా మీద అక్కసుతో ఉక్రెయిన్‌ను ఎగదోసిన అమెరికా ఇటు హమాస్‌పై దాడుల పేరిట గాజాలో నరమేధం సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు కొమ్ముకాస్తోంది. దేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే పెద్దన్న పాత్ర పోషించి, మధ్యవర్తిత్వం నెరిపే అగ్రరాజ్యమే అవకాశవాదిగా మారితే పరిణామాలు ఇంతకంటే భిన్నంగా ఎలా ఉంటాయి?

హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఐక్యరాజ్యసమితి పాత్ర నామమాత్రం కావడం ఆందోళన కలిగించే పరిణామం. గాజాకు మానవతా సాయం సైతం అందనివ్వకుండా ఇజ్రాయెల్ అడ్డుపడుతున్నా, సభ్యత్వ దేశాల సాచివేత ధోరణి కారణంగా సమితి చేష్టలుడిగి చూస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఆరంభమైన తొలినాళ్లలో ఐక్యరాజ్యసమితి తీసుకున్న చొరవ కారణంగా రోజుకు 500 ట్రక్కుల్లో గాజాకు ఆహార పదార్థాలు, ఔషధాలు తదితర సామగ్రి అందేవి. క్రమేణా గాజాకు వస్తున్న ట్రక్కుల సంఖ్య 50కి మించడం లేదు. పైగా గాజాలోకి వచ్చే ఇలాంటి వాహనాల కోసం కేవలం ఒకే ఒక్క ఎంట్రీ పాయింట్‌ను తెరచి ఉంచడం ఇజ్రాయెల్ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోంది. గాజాకు సహాయం అందజేతపై ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల సహాయక చర్యల సంస్థ చేతులు ఎత్తేయడంతో గాజావాసులు అలోలక్ష్మణా అని అలమటిస్తున్నారు. ఈజిప్టు సరిహద్దులకు సమీపంలో ఉన్న రఫా నగరాన్ని ఆక్రమించుకుంటే తప్ప తమ యుద్ధం పరిపూర్ణం కాదని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన ప్రజాస్వామికవాదులకు మరింత కలవరం కలుగజేస్తున్నది. ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు భీతిల్లిన గాజావాసుల్లో

అధిక శాతం మంది రఫా నగరానికి వలస పోయారు. పొరుగునే ఉన్న ఈజిప్టు సరిహద్దులను తెరచి, తమను శరణార్థులుగా అక్కున చేర్చుకుంటుందన్న గాజావాసుల ఆశే ఈ వలసలకు కారణం. ప్రస్తుతం రఫా నగరంలో 14 లక్షల మంది తలదాచుకున్నట్లు అంచనా.ఇజ్రాయెల్ తాజా ప్రకటనలో వారిని కూడా వదలబోమన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ ఫతాపై గెలిచి 2006లో గాజా స్ట్రిప్‌లో అధికారం చేపట్టిన ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ ది మొదటి నుంచీ హింసావాదమే. అమెరికా సహా అనేక దేశాలు హమాస్‌ను ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించి నిషేధం విధించాయి. గాజా అభివృద్ధిని గాలికొదిలి, ఇరాన్, టర్కీల చేయూతతో ఆయుధ సంపత్తిని పెంచుకుంటూపోయిన హమాస్.. పొరుగున ఉన్న ఇజ్రాయెల్ మీద గత ఏడాది అక్టోబర్ 7న చేసిన క్షిపణి దాడి ఆత్మహత్యాసదృశమైనదనే చెప్పాలి. దరిమిలా, ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడులకు గాజాలోని అమాయక జనం బలవుతున్నారన్నదే ఇప్పుడు మానవతావాదుల చేత కంటతడి పెట్టిస్తున్నది. ఇప్పటి వరకూ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 29వేల మంది బలైనట్లు అంచనా. అంతకు రెండు మూడు రెట్ల మంది క్షతగాత్రులయ్యారు. క్షుద్బాధను తట్టుకోలేక గాజావాసులు కలుపుమొక్కల్ని

తింటున్నారన్న వార్తలు, కొన్నిచోట్ల గుర్రాలను చంపి, వాటి మాంసాన్ని భక్షిస్తున్న సంఘటనలు.. అభివృద్ధిలో ఆకాశాన్నంటుతున్నామని చెప్పుకుంటున్న ఆధునిక మానవుడిలో మానవత్వం అడుగంటిపోతోందనడానికి ఉదాహరణలు. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా, సైనిక బలాలను, అణ్వాయుధ సంపత్తిని పోగేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్న అగ్రదేశాలకు కనువిప్పు కలిగితేగానీ ఈ యుద్ధోన్మాదం చల్లారదు. ప్రపంచ దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేందుకు, ఘర్షణాత్మక వైఖరిని పరిహరించేందుకు ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేసి, సమితి ఆదేశాలు శిరోధార్యంగా భావించినప్పుడే ప్రపంచ శాంతి పరిఢవిల్లుతుందనడంలో సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News