Wednesday, January 22, 2025

‘కూలి’న బతుకులు

- Advertisement -
- Advertisement -

ఆటోను ఢీకొన్న లారీ ఆరుగురు మహిళా కూలీలు దుర్మరణం
ఏడుగురికి తీవ్రగాయాలు ఎపిలోని దాచేపల్లిలో దుర్ఘటన
బాధితులు మిర్యాలగూడలోని నర్సాపురం గ్రామస్తులు
ప్రమాద సమయంలో ఆటోలో 23మంది కూలీలు 
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా,
క్షతగాత్రులకు రూ.లక్ష మెరుగైన వైద్యానికి ఆదేశం

మన తెలంగాణ/మిర్యాలగూడ/హైదరాబాద్: మిర్చి తోటలో పనికి వెళ్తూ, ప్రమాదానికి గురై, ఆరుగురు మృతి చెందిన సంఘటన సరిహద్దు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం, పొందుగుల గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గం, దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన 23మంది మహిళా కూలీలు వారి స్వగ్రామమైన నర్సాపురం నుంచి గురజాల మండలం పులిపాడు గ్రామంలో మిరపకాయలు ఏరడానికి కూలీ పనులకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో బుధవారం కూడా ఉదయం 4 గంటలకు ముగించుకొని 4 గంటల 30 నిమిషాలకు ఆటో ఎక్కి కూలి పనికి బయలుదేరారు.

ఈ నేపథ్యంలో వాడపల్లి బ్రిడ్జి దాటి ఆంధ్రా ప్రాంతములో పొందుగుల వద్ద ముందు నుంచి ఒక లారీ అతివేగంగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టి, అందులో ఉన్న ఆరుగురు మహిళా కూలీలు ఇస్లావత్ మంజుల(26), భూక్యా పద్మ(28), మాలోత్ కవిత(30), ఇస్లావత్ పార్వతి(44), భూక్యా సోని(48), వడ్త సక్రి(49)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని, మృతిచెందిన కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 60 వేలు బాధిత కుటుంబాలకు అందజేశారు. మృతి చెందిన ఆరుగురు మహిళల మృతదేహాలను గురుజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి డిఎస్‌పి, సిఐలను ఆదేశించి, దగ్గరుండి పోస్టుమార్టం చేయించారు. వారివెంట డిసిఎంఎస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, జడ్పిటిసి ఆంగోతు లలిత హతీరాం నాయక్, రైతుబంధు నల్లగొండ జిల్లా కమి టీ మెంబర్ వీరకోటిరెడ్డి, ఎండి యూసుఫ్, ఎంపిటిసి బాల లక్ష్మి సత్యనారాయణ, పెద్ద కోటిరెడ్డి, ధీరావత్ పాచు నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు ఇస్లావత్ సేవా నాయక్, మునోతు శివ నాయ క్, మెగా నాయక్, కందుల నాగిరెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నా యక్, అక్కురాం నాయక్, గోవర్ధన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

ఆటోలో ఉన్నవారంతా కూలీలే
పొట్టకూటి కోసం దూరభారమైనా సహించి, పనులకు వెళ్తున్న నిరుపేద మహిళలకు లారీ ప్రమాదం పెనుశాపంగా మారింది. వీరి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని పలువురు కోరారు.ఏడుగురు ప్రయాణించాల్సిన ఆటోలో ఏకంగా 23 మంది ఎక్కడం, అందులో వెనుకభాగంలో నిల్చొని ప్రయాణిస్తున్న మహిళలే మృత్యువాత పడడం గమనార్హం.
రోడ్డు ప్రమాదంపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు మరణించడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సిఎం సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎంఎల్‌ఎ నలమోతు భాస్కర్ రావును సిఎం కేసిఆర్ ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎ భాస్కర్ రావులు ప్రమాద సంఘటనను వివరించి తగు సహాయం చేయాలని కోరిన మేరకు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రుపాయలు, గాయపడిన వారికి ఒక లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియాను సిఎం కెసిఆర్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News