లారీ కేబిన్‌లో ఇరుక్కు పోయిన డ్రైవర్
ప్రాణాపాయం నుండి బయటపడిన డ్రైవర్, క్లీనర్‌లు
మనతెలంగాణ/కట్టంగూర్: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కట్టంగూర్ ఎస్‌ఐ బత్తుల శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం…. విశాఖపట్నం నుంచి కెమికల్ పౌడర్‌తో ముంబయికి కెమిల్ లోడ్‌తో బయలుదేరిన లారీ కట్టంగూర్ మండల పరిధిలోని అయిటిపాముల గ్రామ శివారులోకి రాగానే అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న వరద కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. క్లీనర్ గాయాలతో బయటపడగా, డ్రైవర్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కపోయాడు. విషయం తెలుసుకున్న కట్టంగూర్‌మ ఎస్‌ఐ శివప్రసాద్, హుటాహుటిన తమ సిబ్బందితో కలిసి సంఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు పై ఆరా తీశారు. అనంతరం క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బాటసారులు, స్థానికుల సహకారంతో బయటకు తీశారు. డ్రైవర్, క్లీనర్‌లను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.