అక్కన్నపేట: గూగుల్ లొకేషన్ తప్పుగా చూపించడంతో లారీ నేరుగా గౌరవెళ్లి ప్రాజెక్టు లోపలికి చోచ్చుకుపోయిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. బుధవారం హైదరాబాద్ నుండి రామవరం మీదగా హుస్నాబాద్‌కు వెళ్లేందుకు ఓ లారీ డ్రైవర్ లారీతో వెళుతుండగా దారి తెలియకపోవడంతో గూగుల్ సహాయంతో లొకేషన్ పెట్టుకుని వెళ్తున్న క్రమంలో నందారం స్టేజి వద్ద నుండి గౌరవెల్లి ప్రాజెక్టు మీదగా మ్యాప్ చూపించడంతో నందారం స్టేజి వద్ద మళ్లింపు కావాల్సిన లారీ నేరుగా వెళ్లి గౌరవెల్లి ప్రాజెక్టులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. ఏమి చేయాలో తోచక లారీ డ్రైవర్ అయోమయానికి గురయ్యాడు.
గమనించిన స్థానికులు ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్‌కు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి సాహసం చేసి నీటిలో ఈదుకుంటూ జెసిబి సహాయంతో నీటిలో ఇరుక్కుపోయిన లారీని బయటికి తీశారు. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న లారీ డ్రైవర్ బయటికి వచ్చిన వెంటనే ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సందర్భంగా ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్ మాట్లాడతూ ప్రమాదాలు జరగకముందే సూచిక బోర్డు నందారం స్టేజి వద్ద ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. వీరితో తోక మహేష్, సత్యం తదితరులు ఉన్నారు.