హైదరాబాద్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా నివారించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశమైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు సిఎస్ తో సమావేశమయ్యారు. ఈ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి మాట్లాడుతూ, భారీ వర్షాలకు దెబ్బతిన్న ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.
వరితో పాటు పత్తి పంట పూర్తిగా ధ్వంసమైందని తాము పరిశీలించినట్టు వివరించారు. ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలూ పూర్తిగా నీటమునిగి ఆస్తి నష్టం కలిగాయని అన్నారు. ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ముందుజాగ్రత్త చర్యలవల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా నివారించారని ఈ సందర్భంగా శాంతికుమారి పేర్కొన్నారు. విపత్తుల నివారణకుగాను కేంద్ర ప్రతినిధి బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలించగలమని ఆమె తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, డిప్యూటి సెక్రటరీ అనిల్ గైరోలా, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, హైదరాబాద్, రీజనల్ ఆఫీసర్ ఎస్.కె.కుష్వా, జలశక్తి మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ డైరెక్టర్, రమేష్ కుమార్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్, పొన్నుస్వామి, జె.శ్రీనివాసులు, విద్యుత్ శాఖ అధికారిణి భవ్య పాండే తదితరులు ఉన్నారు.