Tuesday, December 24, 2024

మాస్టర్ ప్లాన్‌తో రైతులకు నష్టం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారు
నిర్మల్ ఘటనపై కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నిర్మల్ లో నూతన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ ఘటనపై కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

నిర్మల్‌లో వందల ఎకరాల భూమిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన బంధువులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఆ భూములకు అనుకూలంగానే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించారని విమర్శించారు. మాస్టర్ ప్లాన్‌లోని లొసుగులను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న బిజెపి కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. నాయకులను అరెస్టు చేసి.. ఎక్కడికి తరలించారో కూడా తెలియదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు అనేక అక్రమాలు చేస్తున్నారు‘ అని కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
రైతులకు నష్టం కలిగించేలా మాస్టర్ ప్లాన్..
నిర్మల్ పట్టణంలో సోఫినగర్ ఇండస్ట్రియల్ జోన్‌ను మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం.. దాన్ని రెసిడెన్షియల్‌గా చేసేందుకు జీవో తెచ్చి రైతులుకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా వారం రోజుల నుంచి రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా మా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిగారు నిరాహార దీక్ష చేస్తున్నారు. గతంలో ఇదే సమస్యపై ఆందోళన చేస్తే.. ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ తెరమీదకు తెచ్చింది. తమ ప్రభుత్వం మళ్లీ వస్తదో రాదోనన్న భయంతో.. అధికారంలో ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దాదాపు 30 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి తలలు పగిలి గాయాలయ్యాయి.

మహేశ్వర్ రెడ్డి దీక్షకు మద్దతు తెలిపేందుకు జాతీయ ఉపాధ్యక్షురాలు డికె ఆరుణ వెళ్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బిజెపి కార్యకర్తలను, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని లాఠీచార్జీ చేశారని ఆరోపించారు. తమ అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే, పౌరహక్కులను అణచివేసే ధోరణి నడుస్తుంది. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు మూల్యం చెల్లించక తప్పదని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసుల తీరును ప్రజల గమనిస్తున్నారని గుర్తుచేశారు. చట్టానికి వ్యతిరేకంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తే తప్పకుండా మీకు చర్యలు ఉంటాయని వెల్లడించారు.

Kishan Reddy 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News