Thursday, January 23, 2025

లాటరీ టికెట్లు అమ్ముతున్న ప్రభుత్వాలు

- Advertisement -
- Advertisement -

దేశ పౌరులందరూ ఆదాయం పన్ను పరిధిలోకి రారు. అయితే రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఆ పరిధిలోకి రాని వారి నుండి కూడా ఏదో రూపంలో కొంత సొమ్మును రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటాయి. వాటిలో మద్యం, లాటరీ అమ్మకాలు ప్రధానంగా కనబడతాయి. ఇలా ఆర్థిక వనరుల సమకూర్పు కోసం మన దేశంలో 13 రాష్ట్రాల్లో లాటరీ దందా నడుస్తోంది. లాటరీల విషయానికొస్తే మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అరుణాచల్‌ప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వీటి అమ్మకాలు సాగుతున్నాయి. అమ్మకాలు, ఆదాయం లెక్కల్లో కేరళ, పశ్చిమ బెంగాల్ ముందు వరుసలో ఉన్నాయి.కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సామాజిక కార్యకర్తల ఆందోళన వల్ల ఇవి పూర్తిగా ఎత్తివేయబడ్డాయి. నిషేధించిన మధ్యప్రదేశ్ తిరిగి ఆగస్టు 2021లో మొదలుపెట్టింది. కేంద్రంలోని గృహ మంత్రిత్వ శాఖ సెక్షన్ 4, లాటరీల నిర్వహణ చట్టం 1998 ప్రకారం కొన్నినిబంధనలతో రాష్ట్రాలు లాటరీలు నడుపుకోవచ్చు.

ఏ రాష్ట్ర లాటరీ టికెట్లను అదే రాష్ట్రంలో అమ్మకం చేసుకోవాలి. ఆ నిబంధన లేకపోతే ఈ వ్యసనం దేశమంతా వ్యాపించేది. కేరళ లాటరీ టికెట్ మన దగ్గర అమ్మితే కొనేవారు ఉండకపోరు. ఆదాయం మాత్రం ఆ రాష్ట్రానికే దక్కుతుంది. లాటరీని నిషేధించిన రాష్ట్రంలో మరో రాష్ట్రానికి చెందిన టికెట్లు అమ్మడం కూడా చట్టరీత్యా నేరమవుతుంది. అయితే ఆన్‌లైన్‌లో దొరుకున్న లాటరీ టికెట్లకు ఈ షరతు వర్తించదు. మన దేశంలో ఏ రాష్ట్రానికి ఆన్‌లైన్ లాటరీ వ్యవస్థకు కేంద్రం అనుమతినీయలేదు. ఆన్‌లైన్ మోసాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలు కాగితంపై లాటరీ టికెట్లను ముద్రించి అమ్మవలసిందే. పశ్చిమ బెంగాల్ లో రెండు రూపాయల టికెట్‌కు అత్యధికంగా రూ.కోటి నగదు బహుమతి ఉంది. కేరళలో మాత్రం కనీస టికెట్ ధర 40 రూపాయలుంది. ప్రథమ బహుమతి ఏడు కోట్లు. ఇంకా కొన్ని బహుమతులు కూడా ఉంటాయి. చివరి సొమ్ము రూ.10 వేల దాకా ఉంటుంది. అసోంలో రెండు రూపాయల టికెట్‌కు ఐదు లక్షల నగదు పెద్ద బహుమతి.

అయితే దేశంలోని మొత్తం లాటరీ వ్యాపారంలో కేరళ వాటా 90% అంటే ఆశ్చర్యపోతాం. మద్యం, లాటరీ అమ్మకాలే కేరళ ప్రధాన ఆదాయ వనరులని గవర్నర్ విమర్శించడం గమనార్హం. కేరళ రాష్ట్ర వసూళ్లలో 13% మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి ఈ రెంటి వల్ల 36% ఆదాయం వస్తుందని మనోరమ పత్రిక రాసింది. పదేళ్ల క్రితం 20 % ఉన్న మద్యం, లాటరీ అమ్మకాల ఆదాయం ఇప్పుడు రెండింతలైంది. లాటరీ కన్నా మద్యం కొనుగోలు ఖరీదైనది, పైగా ప్రజల ఆరోగ్యానికి హాని అని కేరళ ప్రభుత్వం మద్యంపై 254 % పన్ను వేస్తోంది. ఇది దేశంలోనే మద్యంపై వేసిన అత్యధిక పన్నుగా చెప్పుకోవాలి. అయితే ఈ పెంపు వల్ల లిక్కర్ అమ్మకాల్లో ఎలాంటి తగ్గుదల కనిపించకపోవడం గమనించదగ్గది. ఏడాదికి 10 వేల కోట్ల లాటరీ ఆదాయంతో కేరళ దేశంలోనే ముందుంది. అధికంగా సామాన్యులే లాటరీ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, ఒక్క దెబ్బతో తమ కష్టాలన్నీ తొలగిపోవాలని ఆశ పడుతుంటారు.ఆ ఒక్క చిన్న ఆశ బడుగు జీవిని లాటరీ టికెట్ వైపు లాగుతుంది. ఈ బలహీనతనే గాలంగా ప్రభుత్వానికి పనికొస్తుంది. ఒక ఆటో డ్రైవర్‌కు లాటరీ తగిలిందంటే ఆటో డ్రైవర్లందరూ వాటి వెంట పడతారని విశ్లేషకులు అంటున్నారు. లాటరీ ఫలితాల వెల్లడిని సెలబ్రెటీలతో ఒక లైవ్ షో మాదిరి టీవీల్లో ప్రసారం చేయడంతో ఈ క్రేజీ మరింత పెరుగుతోంది. ఓనం పండుగ సందర్భంగా రూ. 25 కోట్ల బంపర్ ప్రైజు ప్రకటించి ప్రభుత్వం పండుగ చేసుకొంది.

ఒక్కో దినకూలీ తన ఆదాయంలోంచి రోజుకు 5 నుండి 10 టికెట్లు కొంటున్నాడు. ఎన్ని ఎక్కువ కొంటే లాటరీ తనకే తగిలే అవకాశం అంత మెరుగ్గా ఉంటుందని వారి భావన. రూ.50 వేల కోట్ల లాటరీ వ్యాపారంపై కేంద్రం 28% జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. మూడున్నర కోట్ల జనాభా ఉన్న కేరళలో రోజుకు లక్షపైన లాటరీ టికెట్లు అమ్ముడవుతున్నాయి. నకిలీ టికెట్లను కట్టడి చేసేందుకు భాగ్యకేరళం అనే యాప్‌ను కూడా ప్రభుత్వం తెచ్చింది. టికెట్ నగదులోంచి అమ్మిన వారికి 10% కమిషన్, 30 % దాకా ఆదాయపు పన్ను కోత ఉంటుంది. ఇలా కేరళ ఖజానాకు రోజుకు 30 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఓనం పండుగ లాటరీలో రూ.25 కోట్లు గెలుపొందిన ఆటోడ్రైవర్ అనూప్ తాను కూడా లాటరీ అమ్మకాల వ్యాపారంలోకి దిగాడు. ఆయన చేతుల ద్వారా టికెట్ కొంటే తమకు అదృష్టం కలిసిరావచ్చనే సెంటిమెంట్‌తో ఆయన స్టోరుకు జనం క్యూ కడుతున్నారు. మరో విచిత్రమేమేమిటంటే లాటరీ తగిలిన టికెట్ తెచ్చి డబ్బులు తీసుకోనివారు కూడా ఉండడంతో అలా గత ఐదేళ్లల్లో రూ. 291 కోట్లు ప్రభుత్వం వద్దే మిగిలిపోయాయి.అప్పటివరకు ఉన్న ప్రైవేటు లాటరీలను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో రాష్ట్ర ప్రభత్వాలే స్వయంగా ఈ రంగంలోకి దిగాయి.

1967లో దేశంలో లాటరీలు ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రము కేరళయే. అది ఆనాటి ఆర్థిక మంత్రి కుంజు సాహెబ్ బుర్రలో పుట్టిన ఆలోచన. కేరళకు అప్పనంగా వస్తున్నా ఆదాయాన్ని గమనించి మరిన్ని రాష్ట్రాలు ఈ దారి పట్టా యి. ఇలా లాటరీలు దేశంలోనే కేరళ ఆదర్శమైంది. కేరళలో ముగ్గురిలో ఒకరు రోజు టికెట్ కొంటున్నారు. రోజుకు 1.8 కోట్ల టికెట్లను రోజు ముద్రిస్తున్నట్లు ఆవిభాగం ఇచ్చిన సమాచారం. లాటరీ టికెట్ అమ్మకంపై ఏజెంట్‌కి 15% కమిషన్ ఉంటుంది. 55 వేల మంది ఏజెంట్లు, లక్షన్నర మంది అమ్మకందారులు ఉన్నారు.
ప్రస్తుతం కేరళ ప్రభుత్వానికి ఇదొక అత్యవసర, దినవారీ కార్యక్రమమైంది. 40 రూపాయల టికెట్ అమ్మకాలపై ప్రతి రోజు 3 గంటలకు ఫలితాలు వెలువడుతాయి. బహుమతి 75 లక్షల నుండి కోటి రూపాయల దాకా ఉంటుంది. ఇంకా ఇతర బహుమతులు కూడా ఉంటాయి. వీటికి తోడుగా విశేష దినాల్లో ఓనం, క్రిస్టమస్ లాంటి పండుగ దినాల్లో ఏడాదికి 6 సార్లు బంపర్ లాటరీలు ఉంటాయి. టికెట్ ధర రూ. 200 ఉంటుంది. వాటి ప్రైజ్ మనీ కోట్లలో ఉంటుం ది. కేంద్రం బంపర్ లాటరీలు ఏడాదికి ఆరుకే పరిమితం చేయడం వల్ల ఇవి హద్దుల్లో ఉన్నాయనవచ్చు. లేకపోతే ఈ ప్రభుత్వాలు బంపర్ పేరిట సామాన్యుడి సొమ్మును మరింత కొల్లగొట్టేవి.

పర్వత ప్రాంతాలు, అధిక అడవులు, వివిధ రకాల పంటల సాగుకు అనుకూలం లేని భూములు, వాతావరణం, పరిశ్రమల లేమి ఇలాంటి పలు కారణాల వల్ల సరిపడే ఆదాయం పొందలేని ఈ రాష్ట్రాలు మద్యానికి అదనంగా లాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నాయనవచ్చు. మద్యం ధర కన్నా లాటరీ టికెట్ ఖర్చు తక్కువ, పైగా తగిలితే దరిద్రం పోతుందనే ఆశ అల్పాదాయ వర్గాల ఆకర్షణగా ఇవి వర్ధిల్లుతున్నాయి. ఈ ఆదాయాన్ని సామాన్యుల ఆరోగ్య, సంక్షేమ పథకాల కోసమే వినియోగిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా లాటరీ అమ్మకాల ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రాలు పెంచుకోవడం దోపిడీకి మరో రూపమే అనక తప్పదు. ఓ రకంగా సామాన్యుడిపై ఆదాయపు పన్ను వేసినట్లే. రోజు ఎంతో ఆశగా కొనడం ఫలితాలు చూసి నిరాశ చెందడం మానసికంగా ప్రభావం చూపి కుంగదీస్తుంది. చేసే పనిలో కూడా మనసు లగ్నం కాదు. ఇలా పౌరులను మానసికంగా, ఆర్థికంగా హింసించే కన్నా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఆదాయం మార్గాలు వెదుక్కోవడం ఉత్తమం.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News