Wednesday, January 22, 2025

భారత్ డిఎన్‌ఎలో ఉన్నదే ప్రేమ

- Advertisement -
- Advertisement -

విద్వేషం వ్యాప్తిలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్
ద్వేషం, హింసాకాండకు తావు లేని హిందుస్థాన్‌ను కోరుతున్నాం
ఛత్తీస్‌గఢ్‌లో జోడో యాత్రలో రాహుల్ గాంధీ
రెండు రోజుల విరామానాంతరం తిరిగి మొదలు

రాయిగఢ్ : ఈ దేశం డిఎన్‌ఎలో ప్రేమ ఉండగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రెండు రోజుల విరామం అనంతరం ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో తిరిగి మొదలైంది. రాయిగఢ్‌లోని కేవ్‌డాబడీ చౌక్‌లో ఒక సభలో రాహుల్ ప్రసంగిస్తూ, ‘ద్వేషం, హింసాకాండకు తావు లేని హిందుస్థాన్‌ను’ తన పార్టీ కోరుకుంటున్నదని చెప్పారు. ‘ప్రస్తుతం ద్వేషం, హింసాకాండ దేశంలో ప్రతి మూలకు విస్తరిస్తున్నాయి.

తమ భాష ఆధారంగా ఇతరులను తాము ఇష్టపడబోమని కొందరు చెబుతుంటారు. ఇతరులను వారి రాష్ట్రాల ఆధారంగా ఇష్టపడబోమని మరి కొందరు చెబుతుంటారు. అటువంటి భావనలు దేశాన్ని బలహీనపరుస్తాయి’ అని ఆయన అన్నారు. ‘భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. అయితే, ఈ దేశం డిఎన్‌ఎలో ప్రేమ ఉన్నది. ఈదేశంలో వివిధ మత విశ్వాసాలు, వివిధ భావనలు ఉన్న ప్రజలు ప్రేమతో శాంతియుతంగా కలసి జీవిస్తున్నారు’ అని రాహుల్ చెప్పారు.

మణిపూర్‌లో నిరుడు మే నుంచి వందలాది మంది చనిపోతున్నా, పలు ఇళ్లను దగ్ధం చేస్తున్నా ఆ కల్లోలిత రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇంత వరకు సందర్శించకపోవడాన్ని రాహుల్ ఆక్షేపించారు. ‘ఆ ఈశాన్య ప్రాంత రాష్ట్రంలో అంతర్యుద్ధం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అదుపు చేయడం లేదు’ అని రాహుల్ విమర్శించారు. ‘నేను అక్కడికి వెళ్లినప్పుడు కుకి భద్రత సిబ్బందిని నియమించుకోవద్దని మీటై తెగవారు నన్ను కోరారు. మీటై సిబ్బంది విషయంలో కుకీలు అదే విధంగా చెప్పారు’ అని రాహుల్ తెలిపారు. స్వల్ప కాలానికి సాయుధ దళాలలోకి సైనికులను చేర్చుకుంటున్న అగ్నివీర్ ప్రక్రియను రాహుల్ విమర్శిస్తూ, లక్షన్నర మంది యువజనులకు న్యాయం చేకూరేలా తన పార్టీ చూస్తుందని తెలియజేశారు. ప్రజలతో నేరుగా అనుసంధానం అయ్యేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టాలని తాను నిశ్చయించినట్లు రాహుల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News