Saturday, November 23, 2024

పల్లె మీది ప్రేమ

- Advertisement -
- Advertisement -

రామగిరి శివకుమార శర్మ ప్రచారకాంక్ష, ఆర్భాటాలు లేని కవి. ఫేస్ బుక్ లో ఆయనకు అకౌంట్ లేదు. ఏ వాట్సాప్ గ్రూపులో కూడా కనిపించరు. గుర్తింపు కోసం పురస్కారాల కోసం తహతహలాడటం, ఎప్పటికప్పుడు మిత్రులందరికీ తన రచనలను ఫోన్ ద్వారా పంపడం, సాహిత్య సంస్థల అధిపతులను సాధ్యమైనంత తరచుగా కలుస్తూ ‘సత్ప్రవర్తన’ను ప్రదర్శించడం, అణగిమణగి ఉండటం, అడుగులకు మడుగులొత్తడం … ఇట్లాంటివేవీ చేయరు ఆయన. సాహిత్య సృష్టి చేయడం మీద మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది ఆయన దృష్టి. పది పన్నెండు సంవత్సరాల క్రితం మెరిగలు అనే శీర్షికతో ఈయన రాసిన ఒక ప్రోజ్ పొయెమ్ ను చదివి, పట్టరాని అనందంతో దాన్ని Unsavoury Grains అనే శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించాను. తర్వాత ఈ కవి మరో నాలుగైదు అట్లాంటి కవితలు రాసి, వాటన్నిటికీ కలిపి మెరిగలు అనే శీర్షికనే ఖాయం చేసినట్టు తెలుసుకున్నాను.

రుచించని కవితలు (unpalatable poems) అనే ధ్వని (suggestion) దాగివుంది ఈ శీర్షికలో. ఈ మధ్యనే ఈయన తన కవితా సర్వస్వాన్ని సింగిడి అనే పేరుతో అచ్చు వేయడం, దాన్ని నేను చదవడం వలన ఈ విషయం తెలిసింది.
శివకుమార శర్మ కవిత్వంలో పల్లె మీది ప్రేమ కేవలం పల్లవించడమే కాదు, వెల్లివిరిసింది కూడా. ఈ కవి ప్రకృతితో, పల్లెలతో, అక్కడి నేలతో గాఢంగా మమేకమయ్యాడని తెలిపే పంక్తులు పుష్కలంగా ఉన్నాయి ఈ పుస్తకంలో. ఐతే మంచి కవిత్వం రాయడానికి అలా మమేకమవ్వడం మాత్రమే సరిపోతుందా అంటే సరిపోదు. దానితో సరితూగే విశిష్టమైన, అందమైన అభివ్యక్తి కూడా అవసరం. పల్లెల్లోని ఇళ్లను వర్ణిస్తూ,తొక్కినా దాటినా ముత్తైదలా కడప/ తలుపుల వెనుక వెన్నాసరుండే బెడెం మొద్దు/ రాత్రంతా ఎలుకలు పారే వంతెన/ గోడల నెత్తిపై ఎత్తిపట్టుకున్న/ పెండెకట్టెల పొగచూరిన నల్లని ఆకాశం, అంటాడు./ యాబై అరవై సంవత్సరాల కిందటి పల్లెటూరి యిళ్ళ రూపురేఖలను ఉన్నదున్నట్టుగా వర్ణించడం ఉంది ఈ పంక్తుల్లో. బెడెం మొద్దును ఎలుకలు పారే వంతెనగా వర్ణించడం కవిలోని బలమైన ఊహశక్తికి తార్కాణమని చెప్పవచ్చు.

రంగులరాట్నంను ఆకాశంలో తిరిగొచ్చే తొట్లె అనడం కూడా చక్కని పోలికే. పల్లెల్లోని దృశ్యాలను వర్ణించేటప్పుడు ఈ కవిలో ఎంత గొప్ప పరిశీలన శక్తి (power of observation) ఉంది, అని ఆశ్చర్యం కలుగుతుంది. తోకమూతి వృత్తమైన కుక్కలు అనడం ఒక ఉదాహరణ. కుక్కలు తమ శరీరాన్ని గుండ్రంగా తిప్పి మూతిని తోక దగ్గరికి తెచ్చి పడుకోవడం ఊళ్లలో సాధారణంగా కనిపించే దృశ్యమే.వంకర తడల్ని పుట్టిస్తూ/ వేటకు వెళ్ళే నీరుకట్టె…/ కొమ్మచెవులకు కట్టిన జుంకాలు/ చద్ది టిప్నీలు/ అన్నప్పుడు కూడా పల్లెను దృశ్యమానం చేసే ప్రక్రియ పరాకాష్ఠకు చేరుకుంది./ మరో సందర్భంలో…/ ‘మొక్కజొన్న చేను/ నడుమ ఒంటరి మంచె/ కోళ్ళు పెరిగిన మంచం’ అనీ, వేరొకచోట, ‘పూల జూలునెగరేసుకున్న చెరుకుచేను’ అనీ హృద్యమైన చిత్రీకరణలు కనిపిస్తాయి. ఇట్లా దృశ్యాలు పాఠకుల మనసులలో చక్కగా బొమ్మకట్టేలా ఊహలకు చక్కని భాషను తొడుగుతూ చిత్రిక పట్టడం కవి పనితనానికి (workmanship కు) నిదర్శనం. వస్తువును కవిత్వం చేయడంలో ఈయనది అందె వేసిన చేయి అని నిరూపిస్తున్నది ఈ పుస్తకం. భావచిత్రాలతో పాటు సరైన పంక్తినిర్మాణసంవిధానం (syntax) కూడా అందుకు తోడ్పడింది.
నగర జీవితంలోని డొల్లతనాన్ని ఎంత బలంగా వ్యక్తీకరిస్తున్నాడో చూడండి:/ ప్రతీ యిల్లు చెవిటిది, గుడ్డిది/ పైగా చుట్టూ కావలి కాసే ప్రహారీ/ నడిచే చూపుల్తో అందగించే వాకిళ్ళు,/ ఇళ్ళ గుప్పిట్లోనే ముడుచుకుని ఉన్నతనాలు/ సూర్యోదయం మరచిన కల!/ కోట్ చేయతగిన మరికొన్ని కవితా వాక్యాల్లోని అందాన్ని ఆస్వాదించండి:/ చక్రాల్ని నడ్డి కిందేసుకుని, పొగతోక జాడిస్తూ, జారుకుంటారు – అందరూ ‘జారు’ చక్రవర్తులే! అంటాడొకచోట. ప్రాచీనకాలంలో రష్యాను పరిపాలించిన రాజులను జారులు (Czars) అనేవాళ్లు అని మనలో చాలా మందికి తెలుసు. ఆ పోలికను తెస్తూ వ్యంగ్యవైభవాన్ని పండించాడు కవి./ ఒకళ్ళనొకళ్ళు ఒరుసుకుపోతున్నా ఎవరికి ఎవరూ ఏమీ కాకపోవడమే సచిత్ర విచిత్రం./ పల్లె బొక్కజెరం వచ్చినోని తీర్గ బక్కబడిపోయింది. పట్నం జెర్రిపోతయింది./ యాప్పుల్లలను కొన్నప్పుడే, జంబికి పోయి బుట్టజైలు పాలపిట్టను చూసినప్పుడే/ పట్నం ఇలువ తెలిసిపోయింది./

ఇటువంటి వ్యంగ్య చమత్కార వైభవం కూడా పుస్తకంలో అక్కడక్కడ చోటు చేసుకుంది.
ఈ పుస్తకంలో ఉన్న quotable quotes ను అన్నిటినీ ఉదాహరిస్తే, దానికే ఎన్నో పేజీలు అవసరమౌతాయి. పోలికలు మనసుకు హత్తుకునేలా ఊహలను ప్రభావవంతంగా అక్షరీకరించడంలో ఈ కవికి మంచి నైపుణ్యం ఉంది. టీవీ సంస్కృతిని నిరసిస్తూ ఏమంటున్నాడో చూడండి: అప్పుడు మా వూరు ఇప్పటిలా టీవీ ఆంటీనా అస్థిపంజరాల్ని ఎగరేస్తున్న ఇనపచెట్లని నింపుకొని లేకుండేది. కవిత్వశక్తిని వర్ణిస్తూ, అక్షరమొక విరిసిన కత్తి/ అది అసత్యాల్ని పోస్టుమార్టం చేస్తుంది, అంటాడు. తమ్ముణ్ని తల్చుకుంటూ, దుమ్ము పుప్పొడి చల్లుకున్న తమ్ముడొక సింగిడి, అంటాడు. ఛమ్కీలు అనే లఘుకవితలలో సైతం తన ప్రతిభను చూపంకుండా వదల్లేదు ఈయన. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:
అమ్మా! ముగ్గే వేయి/ మేఘం చాన్పు చల్లిపోయింది. ఇక్కడ మేఘాన్ని ఒక స్త్రీగా మానవీకరించడం సంపూర్ణ ఆపాదకం (metonymy) కిందికి వస్తుంది. మరో రెండు కవితా పంక్తులను పరిశీలించండి:/ పిల్లలంతా/ నిద్ర పోతున్నారు/ ఎన్ని నాట్య విలాస భంగిమలో?/ రెండు జనవరి 1 లు/ మధ్య/ ఒకే ఒక దీర్ఘ ఆశ్చర్యం./ ఎంత భాషావైదుష్యం ఉన్నా ఈ కవిలో చాదస్తం లేదు. ఈయన ఆధునిక ప్రయోగరీతినే ఇష్టపడతారు. లేకుంటే ఎండుటాకుల్లో అనే బదులు టుగాగమ సంధిని వర్జిస్తూ, ఎండాకుల్లో అని ఎందుకు రాస్తారు? ఈ పుస్తకంలో చాలా చోట్ల ప్రయోగశీలత కూడా కనిపిస్తుంది. త్యాగించుకున్న, భ్రాంతించుకుంటారు, దిగుమతించుకోవడం, ప్రామాణించుకునే, ఉత్పత్తించే, పరిచయించుకోవడం, సందర్భించుకుంటున్నాను ఇలా బోలెడన్ని నూతన ప్రయోగాలు కనిపిస్తాయి శివకుమార శర్మ కవిత్వంలో.
మునిపల్లె రాజు గారు కూడా శివకుమార శర్మ రాసిన కవితలలో ఒకదాన్ని ఆంగ్లానువాదం కోసం ఎంచుకోవడం మూలకవి సామర్థ్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఆధునిక తెలుగు కవిత్వానికి ప్రతినిధులలో ఒకడిగా సంకేతించతగిన, సంభావించతగిన శివకుమార శర్మ వస్తుశిల్పాలను జోడుగుర్రాల రథం చేసి అందంగా పరుగెత్తించాడు. అందుకు ఆయన ఎంత అభినందనీయుడో వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సింగిడి: రామగిరి శివకుమార శర్మ కవితా సర్వస్వం. 235 పేజీలు. వెల 80 రూపాయలు. ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు, కవి ఫోన్ నంబర్ 944019295

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News