Saturday, November 16, 2024

తమిళ సంగం ప్రేమాక్షరం

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు ప్రాచీన తమిళదేశంలో మధురై కేంద్రంగా ఒక సాహిత్య సంఘం ఉండేదనీ, వారు ప్రతి ఏటా గ్రామాల నుంచి కవిత్వాన్ని సేకరించి దానిలో ఉత్తమ కవిత్వాన్ని సంకలనాలుగా రూపొందించారనీ ,కొన్ని వందల యేళ్ళ పాటు తమిళ సంగం కవులు కవిత్వం చెప్పారని చెప్తారు. అలా రూపొందించిన సంకలనాల్లో ‘ఎట్టుత్తొగై’ అనే ఎనిమిది కవితాసంకలనాలూ, ‘పత్తుప్పాట్టు’ అనే పది దీర్ఘకవితలూ ప్రధానమైనవి.

సాధారణంగా సంగం కవిత్వం క్రీం.పూ మూడవ శతాబ్దం నుంచి సా.శ మూడో శతాబ్దం మధ్యకాలంలో వికసించింది లెక్కగట్టడం పరిపాటి. ఆ తర్వాత రోజుల్లో ఎ.కె.రామానుజన్ సంగం కవిత్వం గురించీ, ఆ కవిత్వాన్ని తీర్చిదిద్దిన ప్రాచీన తమిళ రసజ్ఞ దృష్టి గురించీ పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసాక, ఎక్కడెక్కడి తుమ్మెదలూ వచ్చి ఆ తమిళపుష్పం మీద వాలడం మొదలుపెట్టాయి. ఇప్పుడు సంగం కవిత్వం ఎంత బృహత్ మధుకోశమో, ఆ కవిత్వం మీద ప్రతి ఏటా వెలువడుతున్న అనువాదాలూ, అనుశీలనలూ, చర్చలతో అంతకన్నా పెద్ద మధుభాండం తయారవుతూ ఉంది.

తమిళ సంగం కవిత్వం ప్రధానంగా రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకదాన్ని అకం అన్నారు. అది మనిషి మనోమయ, భావనామయ, సంవేదనామయ ప్రపంచం. ప్రణయం దాని ప్రధాన ఇతివృత్తం. కాని అది వట్టి ప్రేమకవిత్వం కాదు. ప్రేమచుట్టూ అల్లిన ప్రకృతి ప్రేమకవిత్వం. నువ్వు జీవిస్తున్న దేశం, కాలం, ఋతుపరిభ్రమణం, పశుపక్ష్యాదులు, పూలు, చెట్లు- సమస్తం అందులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అది మొత్తం తమిళసీమను (తమిళ అని అంటున్నప్పుడు అది కేవలం తమిళనాడుకి మాత్రమే పరిమితమైన భూగోళం కాదు.

దానిలో ఇప్పటి కేరళ, కొంగునాడుని ఆనుకుని ఉన్న కర్ణాటకప్రాంతం, వేంగడంగా పిలిచే ఇప్పటి తిరుపతి ప్రాతం, శ్రీలంక ఉత్తర ప్రాంతం కూడా ఉన్నాయని చెప్పవచ్చు) ఒక కావ్యసీమగా మార్చిన రసవిద్య. ప్రాచీన తమిళ అలంకారికుల దృష్టిలో ప్రేమావస్థలు ఏడు. అందులో రెండు అవస్థలు తీవ్రావస్థలు. అవి కావ్యవస్తువుగా స్వీకరించడానికి పనికి రావు. మిగిలిన అయిదు అవస్థలూ- తొలికలయిక, ఎదురుచూపు, ప్రణయకోపం, విరహదుఃఖం, ఎదబాటు- కావ్యవస్త్వులుగా స్వీకరించదగ్గవి. వీటిని ప్రణయభూమికలు అని కూడా అనవచ్చు. సంగం కవులు వీటిని ‘తిణై’ అన్నారు. ఈ అయిదు తిణైలకీ ప్రతి ఒక్కదానికీ ఒక్కొక్క ప్రాకృతిక సంకేత స్థలం ఉంది, ఋతువు ఉంది, పువ్వు ఉంది, పక్షి ఉంది, సమయం ఉంది. సందర్భం ఉంది.

ఆ తిణైచుట్టూ అల్లిన ప్రతి కవితలోనూ ఈ సంకేతాలు కొన్ని సార్లు వాచ్యంగానూ, కొన్ని సార్లు సూక్ష్మంగానూ ఉంటాయి. అంటే ఆ కాలాన్ని సూటిగా చెప్పకుండా ఆ కాలాన్ని సంకేతించే పువ్వునో, పక్షినో మాత్రమే ప్రస్తావించి ఊరుకుంటారు. సంస్కృత ఆలంకారికులు తర్వాత రోజుల్లో కవిత్వానికి ప్రాణంగానూ, అత్యుత్తమ కవిత్వానికి ప్రమాణంగానూ భావించిన ‘ధ్వని’ సంగం కవిత్వానికి ఆత్మ అని చెప్పవచ్చు. పైకి వర్ణనలాగా ఉండే ఒక కవితలో ఆ తిణై ధ్వనిస్తూ ఉంటుంది. ఆ ధ్వని సహృదయుణ్ణి చేరినప్పుడు అతడు పొందే కావ్యానందం వెలకట్టలేనిది.

సంగం కవిత్వంలోని మరొక విభాగం పురం కవిత్వం. అకం మనోమయ ప్రపంచానికి చెందిన ప్రణయకవిత్వం కాగా, పురం వాస్తవిక ప్రపంచానికి చెందిన సాంఘిక కవిత్వం. అందులో రాజులు, రాజ్యం యుద్ధం, సైన్యం, క్షామం, దానం లాంటి సాంఘిక ఇతివృత్తాలుంటాయి. అకం కవిత్వంలో నాయికా నాయకులకు పేర్లు ఉండవు. సార్వత్రికమైన ప్రేమానుభూతితో కవిత్వ శ్రోత తాదాత్మ్యం చెందడానికి పేర్లతో పనిలేదు కదా. కాని పురం కవిత్వంలో పేర్లు ఉంటాయి, ప్రశస్తి ఉంటుంది. అది రాజులచుట్టూ, దాతలచుట్టూ నడిచే కవిత్వం కాబట్టి అందులో పేర్లు ఉండటకతప్పదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.నేను పరిచయం చేయబోతున్న మూడు సంకలనాల్లోనూ ‘కురుంతొగై’ విరహిణి వైపు నుంచి చెప్పిన కవిత్వంకాగా, ‘అగనానూరు’ ప్రవాసి అయిన పురుషుడివైపు నుంచి చెప్పిన కవిత్వం. ఇక ‘ఐంగురునూరు’ ఇద్దరి వైపు నుంచీ కవిత్వం చెప్తూ, చివరికి ఇద్దరూ చేరువయ్యే మంగళప్రద గృహజీవితం చుట్టూ అల్లిన కవిత్వం.

కవిత నేపథ్యం దాదాపుగా మూసబోసినట్టు ఉండి, భావోద్వేగం కూడా ఒక చట్రానికే కట్టుబడి ఉండకతప్పని ఇటువంటి కవితలు మామూలుగా అయితే నీరసంగానూ, చర్వితచర్వణాలుగానూ ఉండాలి. కాని ప్రతి ఒక్క కవితనీ ఒక రసరమ్య వర్ణచిత్రంగా మార్చడం సంగం కవుల విశిష్టత అని ఒప్పుకోకతప్పదు – వాడ్రేవు చినవీరభద్రుడు
ఈ కవితలు M.L.Thangappa సరళరీతిలో అనువాదం చేసిన Love Stands Alone ( Selections from Tamil Sangam Poetry ) పుస్తకం లోనివి. రెండు వేల సంవత్సరాలకు పూర్వం తమిళనాట విరబూసిన ఈ విరజాజుల లాంటి కవితలు ఇప్పటికీ తాజా సువాసనలు వెదజల్లుతుండడం ఆశ్చర్యం ఆనందం. భూమి కంటే గొప్పదయినది/నల్ల కాండపు కురింజి పూల నుండి/సమృద్దిగా తేనె గ్రోలే తేనెటీగలు గల/పర్వతాల నుంచి వచ్చిన/అతని పట్ల నా ప్రేమ -/భూమి కంటే గొప్పదయినది,/ఆకాశం కంటే విశాలమైనది,/సముద్ర లోతుల కన్నా అగాధమైనది. (ఒక అమ్మాయి తన ప్రియుడి పట్ల తనకున్న ప్రేమానురక్తిని స్నేహితురాలితో తెలిపిన మాటలు) దేవకులత్తార్ ( కురుంతొగై 3 )

ప్రేమాభిమానం : ప్రేమ,దయను వదలిపెట్టి,/సంపదను వెంబడించి /మనల్ని కృంగిపోనివ్వడమే/బలిమైతే/అతన్ని బలంగానే ఉండనివ్వండి. /మనం స్త్రీలం../ అభిమానంతో మూఢులుగా వుందాం. (భర్త బయలుదేరుతున్నప్పుడు ఆ అతివ తన స్నేహితురాలితో అన్నది)– కొప్పెరున్ చోళన్ ( కురుంతొగై 20)
తీపిపాల లాగ :దూడ తాగకుండా,/గిన్నెలో కూడా పట్టకుండా/వృధాగా నేలపాలవుతున్న/ఆవుపాలలాగ../అటు నా ప్రియుడు ఆనందించకుండా/ఇటు నేనూ నిలుపుకోలేకుండా/ విరహతాపం వల్ల/మచ్చల నా మేనిఛాయ/మాయమౌతోంది./ (ఆమె తన స్నేహితతో అంటోంది.) వెల్లివీథియార్ (కురుంతొగై 27) కవయిత్రి
నీటిమడుగుల నేల సమృద్దిగా పుప్పొడితో/ఉడుత పళ్లలాంటి ముళ్ళతో వున్న/విరజాజి మొక్కలు పెరిగే/నీలంపురాశులలా మెరిసే/

నీటిమడుగుల నేల నుంచి వచ్చిన/ఓ కుర్రవాడా…/ ఈ జన్మ ముగిసి/మరొకటి ఎత్తే లోగా/నువ్వే నా భర్తవి../నేనే నీ హృదయరాణిని కావొచ్చని/ నేను నీకు చెప్పనీ. (పశ్చాత్తాప పడుతున్న భర్తకు భార్య అతనితో వున్న గాఢానుబంధాన్ని తెలుపుతూ అన్న మాటలు) అమ్మువనార్ (కురుంతొగై 49)

గ్రామంలో పుకారు : ‘ముల్లై’ మొక్కల నీలం పూలు /గాలికి ఎగిరి/తెగిన హారంలో ముత్యాల్లా/నీళ్ళ పక్కన ఇసకలో/చెల్లాచెదురుగా పడివున్నాయి./అది నీ వాడు /ఎలా వచ్చాడో అలాంటిది./ నేను అతన్ని/ఆరాధిస్తాను./నీ తల్లి అతన్ని/ఇష్టపడుతుంది./ నీ తండ్రి అతన్ని/ఆమోదించాడు./ఇక గ్రామంలో పుకారు/అతనితో నిన్ను జత కలుపుతోంది. (అమ్మాయి స్నేహితురాలు.. అమ్మాయి పెళ్ళి గురించి పెరిగిన ఆశల గురించి అన్న మాటలు) కుండ్రియనార్ (కురుంతొగై 51).

పి.శ్రీనివాస్ గౌడ్- 9949429449

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News