న్యూస్డెస్క్: కొంతమంది ప్రయాణికుల అసభ్య చేష్టల కాణంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డిఎంఆర్సి) ఇటీవల కాలంలో అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. ప్రయాణికుల వికృత చేష్టలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో మెట్రోలో ప్రయాణించే ప్రజలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలంటూ డిఎంఆర్సి పదేపదే ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి రైలు బోగీలో బహిరంగంగా హస్త ప్రయోగానికి పాల్పడడం, అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ రంగంలోకి దిగి ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులను ఆదేశించిన ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా..ఒక యువ జంట మెట్రో బోగీలో ప్రయాణిస్తూ ఇతర ప్రయాణికుల ముందే లిప్ లాక్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రైలు బోగీలోఫ్లోర్ మీద కూర్చున్న ఒక యువకుడి ఒడిలో యువతి కూర్చోగా వారిద్దరూ చుంబించుకుంటున్న దృశ్యాన్ని సహ ప్రయాణికుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. తోటి ప్రయాణికుల ముందు ఇదేమిటంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఇదేమీ ఆసాధారణం కాదంటూ స్పందించారు. మరికొందరైతే ఆ వీడియో తీసిన వ్యక్తిపై మండిపడ్డారు. ఆ జంట అనుమతి లేకుండా ఎలా వీడియో తీస్తారంటూ ప్రశ్నించారు. ఏదేమైనప్పటికీ ప్రయాణికులు మాత్రం మెట్రోలో ప్రయాణించే సమయంలో బాధ్యతయుతంగా ప్రవర్తించాలంటూ డిఎంఆర్సి హితవు చెప్పింది.
Also Read: బస్సులో సీటు ఇవ్వలేదని… యువతిని తిట్టిన జగిత్యాల ఎస్ఐ (వీడియో వైరల్)