కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. కరీంనగర్ మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన నాంపెల్లి అలేఖ్య (21), చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన కొండపర్తి అరుణ్‌కుమార్ (24)లు కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు బంధువులు కావడంతో అబ్బాయి తల్లిని అమ్మాయి బావ వెళ్లి విషయం ప్రస్తావించారు. అబ్బాయి తల్లి తన కొడుకు ఇంకా ఉద్యోగంలో స్థిరపడ లేదు. ఇప్పుడే పెళ్లి చేయలేమనే తెలిపింది. దీంతో అలేఖ్య, అరుణ్‌కుమార్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ అలేఖ్య బుధవారం ఉదయం కరీంనగర్ కాలేజీలో సర్టిఫికెట్స్ ఉన్నాయని ఇంట్లో చెప్పి ఉదయం 11గంటల సమయంలో కరీంనగర్‌కు వచ్చింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి నాంపల్లి రమ అలేఖ్యకు ఫోన్ చేయగా ఫోన్ లిప్టు చేయలేదు.
వెంటనే రమ తన కొడుకు, అల్లుడు కుమారస్వామితో కలిసి కరీంనగర్‌లో ఎక్కడ వెతికినా తన కూతురు జాడ తెలియకపోయే సరికి కూతురు ప్రేమించిన కొండపర్తి అరుణ్‌కుమార్‌కు ఫోన్ చేస్తే అతని ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అతని రూమ్ ఎక్కడ ఎవరికి తెలియకపోవడంతో గురువారం అతడు ఉంటున్న అడ్రస్ తెలుసుకోగా వావిలాలపల్లిలో కిరాయి ఉంటున్నట్లు తెలుసుకుని ఇంటికి వెళ్లి చూడగా ఇంటి లోపల గడియ వేసుకొని ఉంది. ఎంతకీ తలుపులు తీయకపోయే సరికి వెంటిలేటర్ గుండా చూడగా అలేఖ్య ఇంట్లో ఫ్యాన్‌కు, కొండపర్తి అనిల్‌కుమార్ పక్కనే మరో ఫ్యాన్ హుక్కుకు చీరతో ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూడా తాము ప్రేమించుకున్న విషయం పెద్దలకు చెప్పి ఒప్పించలేక తమకు తాముగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి తల్లి రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.