Friday, November 22, 2024

లవ్లీనాకు పతకం ఖాయం

- Advertisement -
- Advertisement -

Lovlina reaching women's welterweight semi-finals

సెమీస్‌లో యువ బాక్సర్ బొర్గోహెన్
భారత్ ఖాతాలో రెండో పతకం!

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం ఖాయమైంది. యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ మహిళల 69 కిలోల విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక సెమీస్‌లో ఓడినా లవ్లీనాకు కనీసం కాంస్య పతకమైన దక్కుతుంది. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను భారత్‌కు రజత పతకం అందించింది. తాజాగా లవ్లీనా మరో పతకాన్ని ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 41 తేడాతో చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్ చిన్‌ను చిత్తు చేసింది. ఇక అస్సాంకు చెందిన లవ్లీనా అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే పతకం ఖాయం చేసుకుని చరిత్ర సృష్టించింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టడంతో ఈసారి బాక్సింగ్‌లో భారత్‌కు పతకం కష్టంగానే కనిపించింది.

కానీ యువ సంచలనం లవ్లీనా సెమీస్‌కు చేరడంతో పతకం లోటు తీరిపోయింది. ఇక నీన్ చిన్‌తో జరిగిన పోరులో లవ్లీనా అసాధారణ ఆటను కనబరిచింది. కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకు పడింది. ఆరంభం నుంచే లవ్లీనా దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థికి కనీసం కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తనకంటే ఎంతో అనుభవజ్ఞురాలైన బాక్సర్‌తో పోటీ పడుతున్నా లవ్లీనాలో ఎలాంటి భయంకానీ ఆందోళన కానీ కనిపించలేదు. తన మార్క్ షాట్లతో అలరించిన లవ్లీనా 32తో తొలి రౌండ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో రౌండ్‌లో మరింత దూకుడును ప్రదర్శించింది. ఈసారి 50 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఓవరాల్‌గా ఈ పోరులో లవ్లీనా 3027, 2928, 2829, 3027, 3027 తేడాతో జయకేతనం ఎగరు వేసింది.

అరుదైన రికార్డు

ఇక ఆడిన తొలి ఒలింపిక్స్‌లోనే సెమీఫైనల్‌కు చేరుకుని లవ్లీనా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బాక్సింగ్‌లో భారత్‌కు పతకం అందించిన మూడో బాక్సర్ లవ్లీనా రికార్డు సాధించింది. అంతేగాక మహిళల 69 కిలోల విభాగంలో భారత్‌కు పతకం సాధించి పెట్టిన తొలి బాక్సర్‌గా కూడా లవ్లీనా నిలిచింది. కాగా, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కూడా లవ్లీనా రెండు కాంస్య పతకాలను సాధించింది. తాజాగా ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరడం ద్వారా విశ్వ క్రీడల్లో కూడా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.

స్వర్ణంపై గురి..

మరోవైపు ఇప్పటికే సెమీస్‌కు చేరి కాంస్యం ఖాయం చేసుకున్న యువ బాక్సర్ లవ్లీనా ఇప్పుడూ స్వర్ణంపై గురిపెట్టింది. ఎలాగైనా స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతానని స్పష్టం చేసింది. సెమీస్‌కు చేరడంతో తనకు ఇప్పటికే ఓ పతకం ఖరారైందని, దీంతో తనపై ఉన్న ఒత్తిడి దాదాపు తొలగిపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు పోటీల్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు తనకు అవకాశం దొరికిందని తెలిపింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశానికి స్వర్ణం అందించడమే తన ముందున్న ఏకైక లక్షమని లవ్లీనా పేర్కొంది. ఇది క్లిష్టమే అయినా అసాధ్యమేమీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపింది. తాను మాత్రం మిగిలిన రెండు పోటీల్లో సర్వం ఒడ్డి పోరాడుతానని ఇందులో సఫలమవుతాననే నమ్మకం తనకుందని లవ్లీనా వివరించింది.

కరోనాను జయించి..

కిందటి ఏడాది దేశాన్ని కుదిపేసిన కరోనా మహమ్మరి యువ బాక్సర్ లవ్లీనాను కూడా వెంటాడింది. 2020 మార్చిలో లవ్లీనా తల్లికి కిడ్నీ మార్పిడి జరిగింది. అప్పుడూ లవ్లీనా తన తల్లి మోమోనీ బొర్గోహెన్‌ను చూసేందుకు స్వస్థలం అస్సాంకు వెళ్లింది. అప్పుడు లవ్లీనా కూడా కరోనా బారిన పడింది. పాజిటివ్ రావడంతో లవ్లీనా 56 రోజుల యూరప్ శిక్షణ టూర్‌కు వెళ్లలేక పోయింది. దీంతో లవ్లీనా కెరీర్ ప్రమాదంలో పడినట్టే కనిపించింది. అయితే లవ్లీనా మాత్రం మనోధైర్యం కోల్పోలేదు. యూరప్‌కు వెళ్లక పోయిన స్వదేశంలోనే శిక్షణ ప్రారంభించింది. తనకు ఉన్న పరిమితుల్లో కఠోర సాధన చేసి మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్‌పై దృష్టి సారించింది. తన మార్క్ శిక్షణతో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. ఇకా విశ్వ క్రీడల్లో అంచనాలకు మించి రాణించి ఏకంగా పతకాన్నే సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. కాగా, లవ్లీనా సెమీస్ సమరం ఆగస్టు 4న జరుగనుంది. ఇందులో గెలిస్తే లవ్లీనా స్వర్ణం రేసులో నిలుస్తోంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం కాంస్యం సొంతమవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News