Friday, December 27, 2024

బంగాళాఖాతంలో బలహీనపడుతున్న అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. అల్పపీడనం బలహీనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి తెలిపారు. దీని ప్రభావంతో 1.5 కిలో మీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వచ్చే 24 గంటలు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. రానున్న రెండు రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తెలంగాణపైనా ఉపరితల ఆవర్తన ప్రభావం : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణ పైనా కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. శుక్రవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో గురువారం నుంచి చిరు జల్లులు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడుతుండడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. ఉదయం హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మంచుతెరలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన పర్యాటకులు చిరు జల్లులను ఆస్వాదించారు. సెలవు రోజు కావడంతో రద్దీ పెరిగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది.

హఠాత్తుగా కురిసిన వర్షంతో హైదరాబాద్‌లో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. పని మీద బయటకు వచ్చినవారు, ఇంటికి వెళుతున్న వారు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సికింద్రాబాద్, తిరుమలగిరి, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, బోరబండ, కూకట్‌పల్లి, కోఠి, హబ్సిగూడ, తార్నాక, నాంపల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి తోడు చలి తీవ్రత పెరగడంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఇబ్బంది పడ్డారు. ఆకాశం మేఘావృత మవుతుందని, పొగమంచు, తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వెలువరించింది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News