హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, సోమవారం నాటికి బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని పేర్కొన్నది. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోనూ దీని ప్రభావం చూపనుందని వ్యాఖ్యానించింది. అయితే ఎపిలో భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. మన రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురువనున్నాయిని, అయితే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా, దక్షిణ చత్తీస్ గడ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని కూడా వెల్లడించింది. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఈ నెల 16,17,18 తేదీల్లో అధికంగా వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ముందస్తూ హెచ్చరికలు జారీ చేసింది.