బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోంది. దీంతో ప్రభావంతో తీరం వెంబడి తీవ్రమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక అల్ప పీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతుండడంతో అధికంగా వీస్తున్న తూర్పు గాలుల వల్ల రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అల్ప పీడనం ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, పలు జిల్లాలో వర్షాలకు అవకాశం ఉంది. ఇదే సమయంలో దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరించింది. ఇక, అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. దీంతో, వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ఏపీ దక్షిణ కోస్తా- తమిళనాడు ఉత్తర ప్రాంత తీరం వెంబడి నైరుతి, పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఈ అల్పపీడనం బలహీనపడుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 27వ తేదీ వరకు ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. 26వ తేదీన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి. 27వ తేదీన ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 28వ తేదీన వాతావరణం పొడిగా ఉంటుంది.
హైదరాబాద్‌లో వర్షాలు : తెల్లవారుజాము నుంచే భాగ్యనగరంలోని పలు ప్రాంతాలతో పాటు జిల్లాల్లోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా ఒక్కసారిగా నగరంలో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్, అమీర్‌పేట్, సనత్ నగర్, బోరబండ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కురుస్తున్న జల్లులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
కురవి, సీరోల్ ,డోర్నకల్, నరసింహులపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి కొన్ని రోజులవుతున్నప్పటికీ ధాన్యం బస్తాలు తరలించడంలో జాప్యం జరుగుతుంది. వాహనాలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచారు. నిల్వ ఉంచిన బస్తాలు, ధాన్యం నిల్వలు అకాల వర్షానికి తడిసి ముద్దయిన్నందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంపెల్లి కేంద్రంలో టార్పాలిన్ కవర్లపై నిలిచిన వర్షపు నీటిని ఎత్తిపోశారు. వర్షాలకు ధాన్యం తడవకుండా రైతన్నలు జాగ్రత్తలు పడుతున్నారు. పలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యానికి వెంటనే కాంటాలు నిర్వహించి మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.