కోస్తాంధ్ర, రాయలసీమ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో భారీ వర్షాలు
చైన్నై : బంగాళాఖాతం నైరుతి, ఆగ్నేయ ప్రాంతాల్లో తుపాను వాతావరణం ఆవరించి ఉందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం బుధవారం తెలియచేసింది. ఇది పశ్చిమవాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు ప్రాంతాలకు పయనిస్తుందని తెలియచేసింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, దక్షిణ కర్ణాటక , కేరళ, మాహే, తమిళనాడు , పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈనెల 24 నుంచి 25 వరకు నైరుతి బంగాళాఖాతంలో, మన్నార్ జలసంధి, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో మత్సకారులు చేపల వేటకు సముద్రం లోకి వెళ్ల రాదని హెచ్చరించింది. తమిళనాడు లోని రామనాథపురం, నాగపట్టినం జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోనే కాకుండా తమిళనాడు లోని మధురై, థేని, శివగంగ, కన్యాకుమారి, పుదుక్కొటై, టెంకసి, కావేరి డెల్టా ప్రాంతాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.