మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్: మూడు రోజుల క్రితం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం ఇచ్చాయి. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రంలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈనెల 13 నుంచి 15 వ తేదీ మధ్య ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అల్పపీడనం ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని దీని ప్రభావంతో ఈ నెల 15న ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.