Monday, January 20, 2025

ఎన్నికల వేళ..వంటింటిపై కరుణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200చొప్పున తగ్గించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. దాంతో 33 కోట్ల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలండర్ ధర ప్రస్తుతం దేశ రాజధానిలో రూ.1.103 ఉంది. తగ్గించిన ధరలతో ఈ సిలిండర్ ధర రూ.903కు తగ్గనుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా.. ఈ తగ్గింపుతో వారికి రూ.400 లబ్ధి చేకూరనుంది.అంటే వారికి గ్యాస్ సిలిండర్ రూ.703కే లభించనుంది. అలాగే ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

2016లో ప్రధానమంత్రి ఉజ్వలయోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కొత్తగా ఇవ్వనున్న గ్యాస్ కనెక్షన్లతో కలిపితే ఉజ్వలలబ్ధిదారుల సంఖ్య10.34 కోట్లకు చేరనుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పలుమార్లు సవరించిన కేంద్రం గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను మాత్రం సవరించలేదు. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. వాస్తవానికి గత రెండేళ్లకాలంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు దాదాపు రెట్టింపు కాఅయ్యాయి. దీంతో వంటగ్యాస్ ధరలు విపక్ష రాజకీయ పార్టీలకు ప్రధానఅస్త్రంగా మారాయి. త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారంలోకి రావడానికి ప్రధాన పార్టీలకు ఇది ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది కూడా.ఇప్పటికే రాజస్థాన్‌లో రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది.

గతంలో ఎన్నికలు జరిగిన కర్నాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ వంటగ్యాస్ ధరల అస్త్రాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఎత్తులను తిప్పికొట్టేందుకే బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వంటగ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వంటగ్యాస్ ధరలను తగ్గించడానికి, ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని, ఓనమ్, రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ప్రధాని ఇచ్చిన కానుక ఇదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తగ్గించిన గ్యాస్ ధరల భారాన్ని ఆర్థికంగా ఎలా భర్తీ చేస్తారనే విషయాన్ని ఠాకూర్ వెల్లడించలేదు. అయితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారంనుంచి గ్యాస్ సిలండర్ ధరలను తగ్గిస్తాయని, ప్రభుత్వం ఆ తర్వాత కంపెనీలకు ఈ భారాన్ని భర్తీచేస్తుందని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News