పాత తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రాలను తయారు చేయించి ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 2012 వరకు మాన్యువల్ గా ఈ ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసి ఈ రిజిస్ట్రేషన్‌ల దందాను నడిపిస్తున్నట్టుగా తెలిసింది. 2015లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి ధ్రువీకరణ పత్రాలను అధికారులు జారీ చేశారు. దీంతోపాటు 2020 లోనూ సుమారుగా 25లక్షల పైచిలుకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు లు ప్రభుత్వానికి అందాయి. 2015, 2020లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లు కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను అమల్లోకి తీసుకొచ్చి ఆగిపోయిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లను చేపట్టాలని, దీనిద్వారా సుమారుగా రూ.10 వేల కోట్ల ఆదాయం వ స్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే అక్రమార్కులు మాత్రం తప్పుడు పత్రాలతో ఈ రిజిస్ట్రేషన్‌ల దందాను కొనసాగిస్తున్నట్టు గా తెలిసింది. ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం కొందరు అక్రమార్కులు మ్యానువల్ గా ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రాలను తయారుచేసి డాక్యుమెంట్ రైటర్‌ల సాయంతో సబ్ రిజిస్ట్రార్‌ల ప్రోత్సాహాంతో ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టుగా సమాచారం. శివార్లలోని పలు వెంచర్‌లలో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గా గండిపడుతుందని దీనిపై ప్రభుత్వం విచారణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ దందా కొనసాగుతుండడంతో కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు దీనిని రోజువారి కలెక్షన్‌గా మార్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. స్థిరాస్తి వ్యాపారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందితో పాటు డాక్యుమెంట్ రైటర్‌లు ఈ దందాను మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నట్టుగా తెలిసింది.
పాత లే ఔట్‌లలోనే ఎక్కువ
పాత లే ఔట్‌లలో ఎక్కువగా ఈ దందా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ లే ఔట్‌లలోని ప్లాట్లకు మాన్యువల్‌గా ఎల్‌ఆర్‌ఎస్ ధ్రు వీకరణ పత్రాలను తయారు చేసి వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారని సమాచారం. మరికొందరు సబ్ రిజిస్ట్రార్‌లు ఒక అడుగు ముందుకేసి ఎల్‌ఆర్‌ఎస్ లేని వెంచర్‌లలోని ప్లాట్లకు ము న్సిపల్, పంచాయతీల నుంచి ఇంటినెంబర్‌లను తీసుకొని వాటి ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే ఆయా ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారని తెలిసింది. ఇలా మేడ్చల్ మల్కాజిగిరి, యాదా ద్రి భువనగిరి, రంగారెడ్డి శివార్ల సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యమంగా అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ సబ్ రిజిస్ట్రా ర్, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పరిధితో పాటు నల్లగొండ, సూర్యాపేట, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ తంతు యథేచ్ఛగా జరుగుతున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2015లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను..
అయితే 2020లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల పైచిలుకు దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. ఈ దరఖాస్తులతో పాటు 2015లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ (48,553) దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో హెచ్‌ఎండిఏకు 1,76,102 దరఖాస్తులు రాగా, 88,117 ఫైనల్ ప్రోసీడింగ్స్ (డిజిటల్ సైన్)తో జారీ చేశారు. 12,133 దరఖాస్తులను మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డు, బఫర్ జోన్‌లో ఉన్నాయని వివిధ కారణాలతో అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో కొందరు దళారులు పాత తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ పత్రాలను మాన్యువల్ చేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టుగా తెలిసింది.