న్యూఢిల్లీ: చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది.
నూతన పార్లమెంట్ భవనంలోకి పార్లమెంట్ కార్యకలాపాలు మారిన తర్వాత మొట్టమొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టింది. పాత పార్లమెంట్ భవనాన్ని ఇక నుంచి సంవిధాన్ సదన్‌గా వ్యవహరిస్తామని సభను వాయిదా వేయడానికి ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు తెలిపారు.
అంతకుముందు సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ గత చేదు జ్ఞాపకాలను వదిలివేసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. కొత్త పార్లమెంటరీ సముదాయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ పౌరులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడవ వంతు స్థానాలను కేలాయించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియం పేరిట రాజ్యాం సవరణ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేఘావల్ సభలో మాట్లాడుతూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య ప్రస్తుత సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని తెలిపారు.