న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.
మణిపూర్‌లో మే నెల 4వ తేదీ నుంచి కొనసాగుతున్న హింసాకాండపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి మూడు రోజులపాటు లోక్‌సభలో చర్చ జరగనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభలో మణిపూర్‌పై ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపడుతుండగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది.
అయితే ప్రధాని ప్రకటన కోసం పట్టుపడుతున్న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రధాని చర్చ ముగింపు రోజున సభలో ప్రకటన చేయడం అనివార్యంగా మారింది. కాగా..లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ కావడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అవిశ్వాసన తీర్మానంపై జరుగుతున్న చర్చలో పాల్గొని సభలో మణిపూర్ హింసాకాండపై ప్రసంగించనున్నారు.