న్యూఢిల్లీ : వక్ఫ్ (సవరణ) బిల్లును ‘దుందుడుకు ధోరణితో ఆమోదించుకున్నారు’ అని వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం మందలించారు. సభా కార్యకలాపాలపై ఒక సీనియర్ సభ్యురాలు తప్పుడు వ్యాఖ్యలు చేయడం ‘అత్యంత దురదృష్టకరం’ అని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య గౌరవానికి భంగకరం అని ఓమ్ బిర్లా అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ అంశాన్ని లేవనెత్తి దీనిపై రూలింగ్ ఇవ్వవలసిందిగా స్పీకర్‌ను కోరిన తరువాత ఓమ్ బిర్లా రాజ్యసభ సభ్యురాలైన సోనియా గాంధీ పేరు ప్రస్తావించకుండా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించారు. గురువారం ఢిల్లీలో సంవిధాన్ సదన్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా ప్రసంగిస్తూ, ‘బుధవారం వక్ఫ్ సవరణ బిల్లు 2024ను లోక్‌సభలో ఆమోదించారు.
గురువారం అది రాజ్యసభలో ప్రస్తావనకు రానున్నది. బిల్లును దుందుడుకు ధోరణితో ఆమోదించారు. మన పార్టీ వైఖరి సుస్పష్టం. బిల్లుతో రాజ్యాంగంపైనే దాడి చేయడమే అవుతోంది. మన సమాజాన్ని శాశ్వతంగా విభజిత స్థితిలో ఉంచేందుకు బిజెపి వ్యూహంలో అది భాగం’ అని విమర్శించారు. ఈ విషయమై రూలింగ్ ఇవ్వాలని రిజిజు విజ్ఞప్తి చేయడంతో ఓమ్ బిర్లా మాట్లాడుతూ, ఈ సభలో సభ్యురాలు కాని, రెండవ సభలో ప్రస్తుతం సభ్యురాలు అయిన కాంగ్రెస్ సీనియర్ సభ్యురాలు ఒకరు వక్ఫ్ (సవరణ) బిల్లును దుందుడుకు ధోరణితో ఆమోదించుకున్నారని పార్లమెంట్ భవన సముదాయంలో వ్యాఖ్యానించారని తెలిపారు.
వక్ఫ్ (సవరణ) బిల్లుపై దిగువ సభలో 13 గంటల 53 నిమిషాల సేపు చర్చ జరిగిందని, వివిధ పార్టీలకు చెందిన పలువురు సభ్యులు చర్చలో పాల్గొన్నారని ఓమ్ బిర్లా గుర్తు చేశారు. ‘బిల్లుపై మూడు సార్లు వోటింగ్ జరిగింది. సభ నిబంధనావళి ప్రకారం అది ఆమోదం పొందింది. సభ రాత్రి బాగా పొద్దుపోయేంత వరకు సమావేశమై, సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును ఆమోదించినప్పటికీ ఒక సీనియర్ సభ్యురాలు సభా కార్యకలాపాలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం అందుకే అత్యంత దురదృష్టకరం. అది సముచితం కాదు’ అని ఓమ్ బిర్లా పేర్కొన్నారు. ‘అది పార్లమెంటరీ ప్రజాస్వామ్య గౌరవానికి విరుద్ధంగా ఉంది’ అని ఓమ్ బిర్లా అన్నారు.