కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జరిగే కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా తయారైంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండేసి విజయాలు సాధించాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానాన్ని సాధించాలని భావిస్తున్నాయి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు.
డికాక్, అజింక్య రహానె, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రసెల్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోనా, రింకు సింగ్, హర్షిత్ రాణా, సునీల్ నరైన తదితరులతో కోల్‌కతా బలంగా కనిపిస్తోంది. అయితే డికాక్, నరైన్‌లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌లకు పని చెప్పక తప్పదు. నరైన్, డికాక్‌లు తమదైన బ్యాటింగ్‌తో చెలరేగితే కోల్‌కతాకు భారీ స్కోరు ఖాయం. ఇక కిందటి మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కూడా జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. కెప్టెన్ రహానె కూడా బాగానే ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నాడు. రఘువంశీ, రింకు సింగ్, రసెల్ తదితరులు చెలరేగితే కోల్‌కతాను ఆపడం లక్నోకు శక్తికి మించిన పనిగానే చెప్పాలి. అయితే నిలకడగా ఆడడంలో కోల్‌కతా విఫలమవుతోంది. ఇది జట్టుకు ప్రతికూలంగా మారింది.
విజయమే లక్షంగా..
ఇక ఈ మ్యాచ్‌లో లక్నో భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. మిఛెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, బడోని వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ పంత్ విఫలమయ్యాడు. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా పంత్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. అప్పుడే జట్టు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.