Monday, January 20, 2025

LSG vs SRH: ఇరు జట్లకు కీలకమే

- Advertisement -
- Advertisement -

నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

మన తెలంగాణ/హైదరాబాద్: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఇరు జట్లకు కీలకమే. ప్రస్తుతం హైదరాబాద్, లక్నోలు 11 మ్యాచుల్లో ఆరేసి విజయాలు సాధించాయి. నాకౌట్ రేసులో నిలువాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ పరాజయం పాలైంది. దీంతో జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి స్థితిలో పటిష్టమైన లక్నోతో పోరు హైదరాబాద్‌కు పరీగా తయారైంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో సమతూకంగా కనిపిస్తోంది. దీంతో సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్ అంత తేలిక కాదనే చెప్పాలి. అసాధారణ ఆటను కనబరిస్తే తప్ప లక్నోను ఓడించడం కష్టమేనని చెప్పక తప్పదు. రాజస్థాన్‌పై ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓటమి చవిచూసింది. బ్యాటింగ్ వైఫల్యం హైదరాబాద్‌ను వెంటాడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 16 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా నిరాశ పరిచాడు. కీలక ఆటగాళ్లు క్లాసెన్, నితీష్ రెడ్డి, షాబాజ్, సమద్ తదితరులు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు.

ఆరంభ మ్యాచుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన అభిషేక్, క్లాసెన్, హెడ్, నితీష్, సమద్ తదితరులు కొన్ని మ్యాచ్‌ల నుంచి వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. వీరి వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బ్యాటర్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. భారీ ఆశలు పెట్టుకున్న అభిషేక్, క్లాసెన్‌లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్ కనబరచడంలో విఫలమవుతున్నారు. లక్నోతో జరిగే మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది.

సవాల్ వంటిదే..

హైదరాబాద్ చివరగా ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. మూడు మ్యాచుల్లో ఓడి నాకౌట్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. బెంగళూరు, చెన్నై చేతుల్లో వరుస ఓటములను చవిచూసింది. ఇక రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద గెలిచింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ఒక పరుగు తేడాతో జయభేరి మోగించింది. ఇక తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న ముంబై చేతిలోనూ ఓడడం హైదరాబాద్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న లక్నోను ఓడించడం అనుకున్నంత తేలిక కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే హైదరాబాద్ సమష్టిగా రాణించక తప్పదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం నాకౌట్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారడం ఖాయం.

లక్నోకు కీలకమే..

మరోవైపు లక్నోకు కూడా ఈ మ్యాచ్ కీలకమేనని చెప్పాలి. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో లక్నో 98 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం కావడంతో లక్నోకు ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్ జట్టుకు కీలకంగా తయారైంది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ రాహుల్‌పై నెలకొంది. రాహుల్ ఈ మ్యాచ్‌లో జట్టుకు కీలకంగా మారాడు. అతను రాణిస్తేనే జట్టుకు మెరుగైన స్కోరు సాధ్యమవుతోంది. మార్కస్ స్టోయినిస్ ఫామ్‌లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. దీపక్ హుడా, పూరన్, కృనాల్, బడోని తదితరులు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇది జట్టును కలవరానికి గురి చేస్తోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో వీరు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. అప్పుడే లక్నోకు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News