ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ నియామకానికి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోద ముద్ర వేశారు. ఆయన ఇక నవంబర్ 20 నుంచి ఐఎస్‌ఐ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న ఫైజ్ హమీద్ నవంబర్ 19 వరకు కొనసాగుతారని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇదిలావుండగా మంగళవారం ఉదయం ఈ ప్రకటన వెలువడక ముందు లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐఎస్‌ఐ సచివాలయంలో భేటీ అయ్యారు. అంజుమ్ పాకిస్థాన్ ఆర్మీ పంజాబ్ రెజిమెంట్‌కు చెందినవాడు. అంతేకాక అతడు కరాచీ కోర్ కమాండర్‌గా కూడా పనిచేశాడు. అతడు ఇంగ్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ నుంచి పట్టా పొందాడు. హనలూలు లోని ఆసియా-పసిఫిక్ సెంటర్ ఫర్ సెక్యూరిటీస నుంచి కూడా అతడు పట్టా తీసుకున్నాడు.