Thursday, December 26, 2024

లక్నో-సిఎస్‌కె మ్యాచ్ వర్షార్పణం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌లక్నో సూపర్‌జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. తొలి ఇన్నింగ్స్ చివరి ఓవర్ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపి వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత భారీ వర్షం కురువడంతో స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్‌జెయంట్స్ 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట అక్కడే నిలిచి పోయింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న చెన్నై బౌలర్లు చెలరేగి పోయారు. స్పిన్నర్లు అద్భుత బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లను హడలెత్తించారు. ఓపెనర్ కైల్ మేయర్స్ (10)ని మోయిన్ అలీ ఔట్ చేశాడు.

ఆరో ఓవర్‌లో మహీశ్ తీక్షణ వరుస బంతుల్లో మన్నన్ వోహ్రా (10), కృనాల్ పాండ్య (0)లను ఔట్ చేశాడు. ప్రమాదకర బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ (6)ను జడేజా వెనక్కి పంపాడు. ఆ వెంటనే కరన్ శర్మ (9) కూడా ఔటయ్యాడు. దీంతో లక్నో 44 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అయూష్ బడోని, నికోలస్ పూరన్ సమన్వయంతో ఆడుతూ స్కోరును వంద పరుగులు దాటించారు. పూరన్ 20 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బడోని 33 బంతుల్లో 4 సిక్సర్లు, రెండు ఫోర్లతో 59 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. ఈ సమయంలో వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. సిఎస్‌కె బౌలర్లలో తీక్షణ, పతిరణ, మోయిన్ అలీ రెండేసి వికెట్లు తీశారు. మ్యాచ్ రద్దు కావడంతో చెన్నై, లక్నోలకు చెరో పాయింట్ కేటాయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News