Friday, November 22, 2024

లక్నోకు కీలకం నేడు కోల్‌కతాతో పోరు

- Advertisement -
- Advertisement -

Lucknow play with kolkata

 

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సమీకరణాలతో సంబంధం లేకుండా లక్నో ప్లేఆఫ్‌కు చేరుకొంటోంది. ఒక వేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు కోల్‌కతా ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ప్లేఆఫ్‌కు చేరడం కష్టమే. ఇక లక్నో ప్రస్తుతం 8 విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 18 పాయింట్లతో నాకౌట్‌కు చేరుకొంటోంది. ప్రస్తుతం రాజస్థాన్ మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఒక దశలో వరుస విజయాలతో అలవోకగా ప్లేఆఫ్‌కు చేరుకునేలా కనిపించిన లక్నో చివరి దశలో పరాజయాలు మూటగట్టుకొంది. దీంతో నాకౌట్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకొంది.

అయితే ఇతర జట్లతో పోల్చితే లక్నోకే ప్లేఆఫ్ చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. చివరి లీగ్ మ్యాచుల్లో ఢిల్లీ, బెంగళూరు జట్లు ఓడిపోతే లక్నోకు ప్లేఆఫ్ బెర్త్ ఖాయమవుతోంది. కానీ లక్నో మాత్రం అలాంటి ఫలితాలపై ఆధారపడకుండా ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో బలంగానే ఉంది. కెప్టెన్ రాహుల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాహుల్ జట్టుకు కీలకంగా మారాడు. డికాక్, బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, స్టోయినిస్, హోల్డర్ తదితరులతో లక్నో బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక మోసిన్ ఖాన్, అవేశ్, హోల్డర్, బిష్ణోయి, చమీరా వంటి మ్యాచ్ బౌలర్లు ఉండనే ఉన్నారు.

దీంతో ఈ మ్యాచ్‌లో లక్నో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు కోల్‌కతాకు నాకౌట్ అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. అయితే ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురు చూడాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో కోల్‌కతా సమష్టిగా రాణించలేక పోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడ లోపించింది. దీని ప్రభావం జట్టుపై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో ఈ లోపాలను అధిగమించి విజయం సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News